శశి థరూర్ వెల్లడి
తిరువనంతపురం: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకోవలసిందిగా తనకు నచ్చచెప్పాలని పార్టీ నాయకులు కొందరు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కోరినట్లు తిరువనంతపురం ఎంపి, పార్టీ సీనియర్ నాయకుడు శశి థరూర్ మంగళవారం వెల్లడించారు. కేరళలో పార్టీ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్న థరూర్ ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ ఉండడం వల్ల పార్టీకి మంచిదని, అందుకే తాను పోటీ నుంచి విరమించుకోవలసిందిగా థరూర్‌ను కోరబోనని రాహుల్ తనకు స్వయంగా చెప్పారని తెలిపారు. పార్టీ అధ్యక్ష పదవికి పోటీ ఉండాలని తాను గత పదేళ్లుగా చెబుతున్న విషయాన్ని రాహుల్ తనకు గుర్తు చేశారని ఆయన తెలిపారు.
థరూర్ చేత అభ్యర్థిత్వాన్ని ఉపసంహరింపచేయాలని తనను పార్టీ నాయకులు కొందరు కోరిన విషయాన్ని రాహుల్ తనకు చెప్పారని ఆయన తెలిపారు. తాను ఆ పని చేయనని వారితో స్పష్టంగా చెప్పానని రాహుల్ అన్నారని థరూర్ వివరించారు. పోటీ నుంచి తప్పుకోనని, ఎన్నికల్లో పోటీ చేస్తానని తాను కూడా రాహుల్‌కు తెలిపానని ఆయన చెప్పారు. పార్టీలోని పెద్ద నాయకులు తనను బలపరుస్తారని తాను ఎన్నడూ భావించలేదని, ఇప్పుడు కూడా భావించడం లేదని థరూర్ తెలిపారు. అయితే తనకు అందరి మద్దతు కావాలని ఆయన అన్నారు. తాను నాగపూర్, వార్ధా, హైదరాబాద్‌లో పార్టీ కార్యకర్తలను కలిశానని, పోటీలో ఉండాలని, తప్పుకోవద్దని వారంతా తనకు చెప్పారని ఆయన తెలిపారు.