Monday, December 23, 2024

స్వరాజ్ ఆశ్రమం సందర్శించిన రాహుల్

- Advertisement -
- Advertisement -

సర్దార్ పటేల్‌కు రాహుల్ నివాళి
స్వరాజ్ ఆశ్రమం సందర్శించిన రాహుల్
గుజరాత్‌లో న్యాయ్ యాత్ర చివరి అంకం
యాత్రకు నేడు విరామం
తాపి: కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ గుజరాత్‌లో తన ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ చివరి దశలో ఆదివారం సూరత్‌లో స్వరాజ్ ఆశ్రమం సందర్శించి, సర్దార్ వల్లభాయ్ పటేల్‌కు శ్రద్ధాంజలి ఘటించారు. నాలుగు రోజులలో గుజరాత్‌లో ఏడు జిల్లాల మీదుగా సాగిన యాత్ర ఆదివారం రాష్ట్రంలో ముగిసిందని, ఒక రోజు విరామం అనంతరం మంగళవారం మహారాష్ట్ర నందుర్బార్ జిల్లాలో తిరిగి మొదలవుతుందని కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేష్ తాపిలో విలేకరులతో చెప్పారు.

రాహుల్ గాంధీ సూరత్ జిల్లా బార్డోలిలో స్వరాజ్ ఆశ్రమం సందర్శించి సర్దార్ వల్లభాయ్ పటేల్‌కు నివాళి అర్పించారు. ‘సర్దార్ వల్లభాయ్ పటేల్ 1922లో ఏర్పాటు చేసిన స్వరాజ్ ఆశ్రమాన్ని కొన్ని నిమిషాల పాటు సందర్శించారు. ఢిల్లీ, హర్యానా సరిహద్దులో సమీకృతమైన వివిధ రాష్ట్రాల రైతులకు అన్యాయం జరుగుతున్న నేపథ్యంలో భారత్ జోడో న్యాయ్ యాత్రకు అది ఒక స్ఫూర్తిదాయక క్షణం’ అని రమేష్ పేర్కొన్నారు. యాత్ర గుజరాత్ అంకాన్ని ముగించిన పిదప రాహుల్ తాపి జిల్లాలోని వ్యారా నుంచి న్యూఢిల్లీకి బయలుదేరి వెళ్లారు.

లోక్‌సభ ఎన్నికలకు ముందు రాహుల్ చేపట్టిన ఈ బృహత్ యాత్ర గుజరాత్‌లో ఏడు జిల్లాల మీదుగా నాలుగు రోజుల్లో 400కిలో మీటర్లకు పైగా సాగింది. సర్దార్ పటేల్ తన నివాసంగా స్వరాజ్ ఆశ్రమాన్ని నిర్మించారు. అప్పటి బ్రిటిష్ వలసవాద ప్రభుత్వం సాగుదారులకు పన్ను హెచ్చింపునకు నిరసనగా రైతుల ఆందోళన, జాతీయవాద ఉద్యమంగా బార్డోలి సత్యాగ్రహం వ్యూహరచనకు, నిర్వహణకు ఒక కేంద్రంగా ఆశ్రమం ఉపయోగపడింది. మహాత్మ గాంధీ కూడా 1936, 1941 సంవత్సరాలలో ఆశ్రమంలో బస చేశారు. ‘మేము ఆర్‌ఎస్‌ఎస్ సిద్ధాంతానికి వ్యతిరేకంగా పోరాడుతున్నాం. దీర్ఘ కాలం దానిని కొనసాగిస్తాం.

గెలిచినా, ఓడినా ఎన్నికలలో పోరాడతాం. కానీ రాహుల్ మా సిద్ధాంతం పటిష్ఠం చేసి, జనం చేరువకు తీసుకువెళ్లడానికి కాంగ్రెస్‌కు ఒక మార్గం చూపారు’ అని రమేష్ చెప్పారు. ‘సోమవారం (యాత్ర భాగస్వాములకు) విరామ దినం. మహారాష్ట్ర నందుర్బార్ జిల్లా నుంచి మంగళవారం (12న) యాత్ర తిరిగి మొదలవుతుంది. అక్కడ ఆదివాసీ సమ్మేళనం జరుగుతుంది’ అని రమేష్ తెలియజేశారు. 13న రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ధూలెలో ఆదివాసీ మహిళల సమావేశంలో ప్రసంగిస్తారు. మహిళలకు న్యాయంపై పార్టీ గ్యారంటీని వారు ఆ సమావేశంలో ప్రకటిస్తారు’ అని రమేష్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News