న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విదేశీ పర్యటనపై భారతీయ జనతా పార్టీ అనుమానాలు వ్యక్తం చేసింది. సుదీర్ఘ పర్యటన తర్వాత రాహుల్ భారత్‌కు రానున్నట్లు వార్తలు వస్తోన్న నేపథ్యంలో కమలం పార్టీ స్పందించింది. రాహుల్ గత నెల చివర్లో ఆరు రోజుల పర్యటన నిమిత్తం అమెరికా వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ ప్రవాస భారతీయులు, వెంచర్ క్యాపిటలిస్టులు, తదితర రంగాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.
ఆ తర్వాత నుంచి ఆయన పర్యటన వివరాలు బయటకు రాలేదు. దీనిని ఉద్దేశించి బిజెపి నేత అమిత్ మాలవీయ స్పందించారు. ‘రాహుల్ గాంధీ ఎందుకు ఎక్కువ సమయం విదేశాల్లోనే ఉంటున్నారు..?ఆ పర్యటనల్లో భాగంగా చాలా రోజులు ఎక్కడికి వెళ్లారో తెలియట్లేదు, ఆ మిస్టరీ ఏంటి? భారతదేశ ప్రయోజనాలకు విరుద్ధంగా విదేశీ ఏజెన్సీలు, గ్రూపులతో ఆయన జరుపుతోన్న సమావేశాలపై వస్తోన్న నివేదికలు ఆ పర్యటనలపై పలు అనుమానాలకు తావిస్తున్నాయి’ అని విమర్శిచారు.