Monday, December 23, 2024

రాహుల్ వ్యాఖ్యలు అభ్యంతరకరం, అవగాహనా రాహిత్యం: కొప్పుల ఈశ్వర్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : ఖమ్మం సభలో రాహుల్ మాటలు అభ్యంతరకరంగా ఉన్నాయని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. పార్టీలో ప్రధాన నాయకుడుగా ఉన్న రాహుల్ గాంధీ మాటలు అవగాహనా రాహిత్యంతో కూడుకున్నాయన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి రాహుల్ మాట్లాడడం హాస్యాస్పదమని అన్నారు. సోమవారం మంత్రి సచివాలయం మీడియా సెంటర్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

మూడేళ్ళ రికార్డు సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసి రాష్ట్ర రైతాంగానికి సాగునీరు అందిస్తున్నామన్నారు. రూ.80 వేల కోట్ల పై చిలుకు నిధులతో ముఖ్యమంత్రి కెసిఆర్ ఈ ప్రాజెక్టును నిర్మించారని మంత్రి తెలిపారు. ఈ ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్రానికి జీవనాధారమని ఆయనన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలమయ్యిందన్నారు. నాడు కరువుతో ఉన్న తెలంగాణ నేడు ఎక్కడ చూసిన నీళ్లు ఉన్నాయని తెలిపారు. ఈ ప్రాజెక్టుతో దేశంలోనే అత్యధిక వరి ధాన్యం రాష్ట్రంలో పండుతుందన్నారు. దేశానికి అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ ఎదిగిందంటే అందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టే కారణమన్నారు . అలాంటి ప్రాజెక్టు గురించి రాహుల్ గాంధీ అడ్డగోలుగా మాట్లాడారని విమర్శించారు.

దేశంలో ఎక్కడ లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలో రైతు సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయని, కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఇలా మాట్లాడం విడ్డురంగా ఉందని మంత్రి చెప్పారు. ఇక్కడి నాయకులు రాసిచ్చిన అబద్దాల స్క్రిప్టు రాహుల్ గాంధీ చదివారని కొప్పుల అన్నారు. ఉట్టికి ఎగురలేనమ్మ స్వర్గానికి ఎగురుతాం అన్నట్టు 4000 పెన్షన్ అనేది ఉందన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎంత పెన్షన్ ఇస్తున్నారో ముందుగా చెప్పాల్సిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే 2016 పెన్షన్ అమలులో ఉందని, వికలాంగులకు 3016 ఉంటే రూ. 4000 చేస్తామని ఇప్పటికే ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించారని గుర్తు చేశారు.

పోడు భూముల గురించి కూడా అబద్ధపు మాటలు మాట్లాడారని కొప్పుల విమర్శించారు. ఇప్పటికే రాష్ట్రంలో పోడు భూముల పంపిణీ జరుగుతోందని, అయినప్పటికీ మేము అధికారంలోకి వస్తే పోడు భూములు పంపిణీ చేస్తామంటున్నారు రాహుల్ గాంధీ చెప్పడం హాస్యాస్పదమని అన్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీని అరెస్ట్ చేస్తారని చెప్పారు కానీ ఎందుకు అరెస్ట్ చేయలేదని ఆయన ప్రశ్నించారు. హుజురాబాద్, మునుగోడు ఉప ఎన్నికల్లో ఎవరు ఎవరికి బి టీం గా ఉన్నారో అందరికి తెలుసని కొప్పుల అన్నారు. మీరు పాలిస్తున్న రాష్ట్రాల్లో ఎందుకు ఇక్కడ అమలవుతున్న పథకాలు అమలు చేయడం లేదని మంత్రి ప్రశ్నించారు. కల్యాణ లక్ష్మీ,షాది ముబారక్, గురుకుల పాఠశాలలు ఎందుకు మీరు అధికారంలో ఉన్న రాష్ట్రంలో అమలు చేయడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ లో మీ మాటలు నమ్మేవారు లేరని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలు చాలా గొప్పవారని, ఇక్కడ పథకాల ఫలితాలు అందుకున్న వారికి అన్ని తెలుసని అన్నారు. పిసిసి నాయకుడు రేవంత్ రెడ్డి ఎస్‌సి సామాజిక వర్గానికి చెందిన నాయకుడు భట్టి విక్రమార్కను వేదిక మీదనే తోసివేశాడని, ఇది మీ సంస్కారం అని కొప్పుల ఈశ్వర్ ధ్వజమెత్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News