ఒడిశా తాల్చేర్ కోల్ ఫీల్డ్‌లో బొగ్గు రవాణా సౌకర్యాలను మెరుగు పరుస్తాం
నైనీలో సింగరేణి పురోగతి భేష్
కేంద్ర బొగ్గు మంత్రిత్వశాఖ అదనపు కార్యదర్శి మద్దిరాల నాగరాజు
మన తెలంగాణ/హైదరాబాద్ : ఒడిశా రాష్ట్రంలో తాల్చేర్ కోల్ ఫీల్డ్‌లో బొగ్గు బ్లాక్‌లు పొందిన ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల బొగ్గు రవాణా కోసం అతి త్వరలోనే మహానది కోల్ రైల్వేస్ లిమిటెడ్ (ఎంసిఆర్‌ఎల్) రైల్వేలైన్‌ను పూర్తి చేయడం కోసం తమ వంతుగా ప్రత్యేక చొరవ తీసుకుంటానని కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి మద్దిరాల నాగరాజు తెలిపారు. ఇందుకు సంబంధించి త్వరలోనే రైల్వే, బొగ్గు మంత్రిత్వ శాఖల అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఒడిశా రాష్ట్రంలో బొగ్గు బ్లాక్‌లు పొందిన సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్‌తో పాటు మరో ఐదుసంస్థల ఉన్నతాధికారులతో రాష్ట్ర రాజధాని భువనేశ్వర్‌లో మంగళవారం బొగ్గు రవాణా సౌకర్యాలపై ఆయన ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఒడిశా రాష్ట్రంలోని మహానది కోల్ ఫీల్డ్‌ను సందర్శించిన అనంతరం నాగరాజు సమావేశాన్ని నిర్వహించారు. దేశ అవసరాల రీత్యా ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకు కొత్త బొగ్గుబ్లాక్‌లను కేటాయించామన్నారు. ఒడిశాలో సింగరేణి సంస్థ ఇప్పటికే బొగ్గు ఉత్పత్తికి సంసిద్ధమవడం సంతోషకరమని, వారు ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లడం హర్షణీయమన్నారు. అలాగే మిగిలిన సంస్థలు కూడా ఏడాదిలోగా బొగ్గు ఉత్పత్తిని ప్రారంభించనున్నందున బొగ్గు రవాణా సౌకర్యాలపైన తాము ప్రత్యేక దృష్టి సారించామన్నారు.
సింగరేణితో పాటు ఒడిశా మైనింగ్ కార్పోరేషన్ లిమిటెడ్ (ఒఎంసిఎల్), నాల్కో, కర్ణాటక పవర్ కార్పోరేషన్ లిమిటెడ్ (కెపిసిఎల్), ఎస్సెల్ మైనింగ్ అండ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఇఎంఐఎల్), వేదంతా లిమిటెడ్ బొగ్గు ఉత్పత్తిని ప్రారంభించనున్నాయని, ఈ బొగ్గును రవాణా చేయడం కోసం నిర్మించతలపెట్టిన ఎంసిఆర్‌ఎల్ రైల్ మార్గం త్వరలో అందుబాటులోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. రైలు మార్గ నిర్మాణానికి ఎటువంటి నిధుల కొరత లేదని, దీనిపై తాను ప్రత్యేక శ్రద్ధ తీసుకొని నిర్మాణం పూర్తయ్యేలా చూస్తానని బొగ్గు బ్లాక్ ల యాజమాన్యాలకు ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు.
ఈ రైలు మార్గ నిర్మాణం పూర్తవడానికి మరికొంత సమయం పడుతుందని కాబట్టి ఈ లోపు ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం వారు సింగరేణి వారి నైనీ బొగ్గు బ్లాక్ ను, ఇతర కంపెనీల బ్లాక్ లను కలుపుతూ ఛెండిపడ పట్టణం నుంచి మజక, కరిజంగా వరకు గల 40 కిలోమీటర్ల నిడివి గల రోడ్డును విస్తరించాలని కోరుతున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు తాను గురువారం స్వయంగా ఆ రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శిని కలవనున్నట్లు తెలిపారు.
ఈ సమావేశంలో తొలుత సింగరేణి సంస్థ ఉన్నతాధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా నైనీ, న్యూ పాత్రపాద బొగ్గు బ్లాక్ పనుల పురోగతి, బొగ్గు ఉత్పత్తి, చేయాల్సిన బొగ్గు రవాణా తదితర అంశాలపై వివరించారు. సింగరేణి అడ్వైజర్(మైనింగ్) డిఎన్.ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (కోల్ మూమెంట్) జె.ఆల్విన్, నైనీ అడ్వైజర్ విజయరావు, సింగరేణి ఒడిశా జనరల్ మేనేజర్ సురేశ్, డిజిఎం (మార్కెటింగ్) మారేపల్లి వేంకటేశ్వర్లు, ఒడిశా రాష్ట్ర స్టీల్ అండ్ మైన్స్ స్పెషల్ సెక్రటరీ మనోజ్ మిశ్రా, ఎంసిఆర్‌ఎల్ ఛైర్మన్ ఒపి సింగ్ తదితరులు పాల్గొన్నారు.