హైదరాబాద్: ఆగస్టులో సిద్దిపేటకు రైలు సర్వీసులను ప్రారంభించేందుకు దక్షిణ మధ్య రైల్వే ఏర్పాట్లు చేస్తోంది. మనోహరాబాద్- టు కొత్తపల్లి ప్రాజెక్టులో భాగంగా ఆగస్టు మొదటి వారాంతానికి సిద్దిపేట వరకు రైల్వే లైన్ సిద్ధం కాబోతోంది. ఈ లైన్ పూర్తి కాగానే తిరుపతికి, బెంగళూరు, ముంబై ఎక్స్‌ప్రెస్ రైళ్లను సిద్దిపేట నుంచి నడపాలని దక్షిణ మధ్య రైల్వే అధికారులు నిర్ణయించినట్టుగా తెలిసింది. హైదరాబాద్ నుంచి ప్రారంభమవు తున్న కొన్ని ఎక్స్‌ప్రెస్‌లను సిద్దిపేట నుంచి ప్రారంభిస్తే, కరీంనగర్ ప్రయాణికులకు కూడా వెసులుబాటుగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.
వేగంగా రైల్వే స్టేషన్ భవన నిర్మాణం
సిద్దిపేటలో రైల్వే స్టేషన్ భవనం వేగంగా సిద్ధమవుతోంది. దీంతోపాటు సరుకు రవాణాకు భారీ గూడ్స్ యార్డును నిర్మిస్తున్నారు. ఇక్కడ మొత్తం ఐదు లైన్లను ఏర్పాటు చేస్తున్నారు. ఒకటి మెయిన్ లైన్, రెండు లూప్‌లైన్లు, ఒకటి గూడ్స్ లైను, ట్రాక్ మెయింటెనెన్స్ వినియోగించే ట్రాక్ మిషన్ కోసం సైడింగ్ లైన్ ఏర్పాటు చేస్తున్నారు. ప్లాట్‌ఫ్లాంను 750 మీటర్ల పొడవుతో సిద్ధం చేస్తున్నారు. ఈ ప్రాంతం నుంచి సరుకు రవాణా భారీగా చేపట్టాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించినట్టుగా తెలిసింది. దీనికోసం దాదాపు 800 మీటర్ల పొడవుతో గూడ్సు షెడ్డును ఏర్పాటు చేస్తోంది.
ట్రాక్ సామర్థ్యం పరీక్ష తరువాత
ప్రస్తుతం సిద్దిపేట సమీపంలోని దుద్దెడ వరకు పూర్తిస్థాయి ట్రాక్ ఏర్పాటు పూర్తికాగా, అక్కడి నుంచి సిద్దిపేట వరకు తాత్కాలిక ట్రాక్ ఏర్పాటు పూర్తయింది. సిద్దిపేట బైపాస్ వరకు ఆ పనులు పూర్తయిన తర్వాత శాశ్వత ప్రాతిపదికన పట్టాలు ఏర్పాటు చేస్తారు. ఆ వెంటనే రైల్వే సేఫ్టీ కమిషనర్ దుద్దెడ నుంచి సిద్దిపేట వరకు ట్రాక్ సామర్థ్యాన్ని పరీక్షించి అనుమతి ఇవ్వగానే రైలు సేవలు ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.