Sunday, December 22, 2024

మా కోచ్ ఫ్యాక్టరీ మాగ్గావాలే!

- Advertisement -
- Advertisement -

మా కోచ్ ఫ్యాక్టరీ మాకు కావాలె అని ముక్తకంఠంతో కాజీపేట ప్రజలు నినదిస్తుంటే.. అదేం పట్టని కేంద్ర బిజెపి నాయకత్వం మాత్రం ప్రాధాన్యత లేని వ్యాగన్ పరిశ్రమకు నిన్న ప్రధాని మోడీ చేతుల మీదుగా శంకుస్థాపన చేయించి.. పైసా పనికి రూపాయి ప్రచారం చేసుకున్న చందంగా అవసరంలేని వ్యాగన్ పరిశ్రమ ఇచ్చి ఏదో భారీ ప్రాజెక్టు ఇచ్చినట్లుగా ప్రచారం చేసుకోవడం వారి డాంబరికాన్ని తేటతెల్లం చేస్తుంది.ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం కల్లబొల్లి మాటలతో కాజీపేటకు కోచ్ ఫ్యాక్టరీ విస్మరిస్తే.. నేటి బిజెపి ప్రభుత్వం ఇంకో అడుగు ముందుకేసి ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా విభజన హామీలను తుంగలో తొక్కుతూ తెలంగాణ ప్రాంత ప్రజల దశాబ్దాల కలను కాలరాస్తున్నారు… మూడుసార్లు ఇచ్చినట్లే ఇచ్చి పక్క రాష్ట్రాలకు తరలించడమే కాకుండా 2014 ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పొందుపర్చినప్పటికీ, ఏడేండ్లుగా ఆశగా ఎదురు చూస్తున్నప్పటికీ కేంద్రం ఈసారి బడ్జెట్‌లో కూడా ఎలాంటి హామీ ఇవ్వకపోవడం వారికి తెలంగాణ

మీద ఉన్న ప్రేమ ఎలాంటిదో నిరూపితమైంది. నిజాంల కాలంలో నిర్మింపబడిన (1874-1889) కాజీపేట రైల్వేస్టేషన్ ఆనాడు ప్రయాణికులతో, కార్మికులతో కిటకిటలాడేది. 150 ఏండ్ల చరిత్ర గల కాజీపేట రైల్వేస్టేషన్‌కు డివిజన్ కాగల అన్ని అర్హతలు ఉన్నప్పటికీ నేటికి ఇంకా జంక్షన్‌గానే మిగిలిపోయింది.ఇటీవల కూడా రాజకీయ అవసరాలను దృష్టిలో పెట్టుకొనే మహారాష్ట్రలోని లాతూరుకు కోచ్ ఫ్యాక్టరీని తరలించడంపై రాష్ట్ర ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు.. అంతేకాకుండా విభజన చట్టంలోలేని నేడు అంతగా ఫలితం దక్కని వ్యాగన్ల వర్క్‌షాప్‌ను సైతం రాష్ట్ర ప్రభుత్వం కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణం కోసం సేకరించి అందించిన 150 ఏకరాల్లోనే ఏర్పాటుకు సిద్ధమైంది. దీని వల్ల తెలంగాణ నిరుద్యోగ యువతకు పెద్దగా ఒరిగేదేమీ లేదు. దీని వల్ల పెద్దగా ఉద్యోగావకాశాలు దక్కే అవకాశం లేదు. ఒకసారి తెలంగాణ ప్రాంతానికి కోచ్ పరిశ్రమ ఏర్పాటు విషయంలో జరుగుతున్న అన్యాయం గురించి చర్చిద్దాం.. 1982 సం॥లో కాంగ్రెస్ ప్రభుత్వం కాజీపేటకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీని మంజూరు చేయగా ఆ

నాడు ఇందిరా గాంధీ మరణం, సిక్కుల ఉచకోత.. వారిని శాంతింపజేసేందుకు తరువాత అధికారంలోకి వచ్చిన ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ పంజాబ్‌లో పేట్రేగిపోతున్న ఉగ్రవాదం, నిరుద్యోగం లాంటి తదితర అంశాలను చూపి పంజాబ్‌లోని కపూర్తలకు 1985వ సంవత్సరంలో తరలించారు.. అనంతరం మళ్ళీ అదే కాంగ్రెస్ ప్రభుత్వం ఉత్తరప్రదేశ్‌లోని రాయ్ బరేలికి 2012లో తరలించింది.ఇక కోచ్ ఫ్యాక్టరీ విషయంలో సహించేది లేదని ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర విభజన సమయంలో పునర్విభజన చట్టంలో కొట్లాడి మరి రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా పలు అంశాలను పొందుపరచడం జరిగింది.అందులో భాగంగా కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ హామీని పునర్విభజన చట్టంలో 13వ షెడ్యూల్ 10వ అంశంగా తెలంగాణకు కోచ్ ఫ్యాక్టరీ అంశాన్ని ప్రత్యేక అంశంగా చేర్చింది.. కానీ ఆ విభజన హామీ అంశం పట్ల కేంద్రం మాట మార్చింది. రాష్ట్రం ఏర్పడిన ఆరు నెలలలోపే కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని చట్టం చెపుతున్నప్పటికీ ఆ విషయాన్ని విస్మరిస్తుంది.

రాష్ట్రానికి కేటాయించాల్సిన పరిశ్రమను గుట్టుచప్పుడు కాకుండా మహారాష్ట్రలోని లాతూర్ (625 కోట్ల వ్యయంతో 350 ఎకరాల్లో ఏర్పాటు చేసింది. దీని వల్ల అక్కడి ఎనిమిది వేల మంది నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. అంటే కాజీపేట యువతకు ఎనిమిది వేల ఉద్యోగాలను కేంద్ర ప్రభుత్వం కాలరాసిందని అర్ధం. తరలించి తెలంగాణకు తీరని అన్యాయాన్ని మిగిల్చింది. ఈ విషయంపై ప్రశ్నిస్తే స్థల సేకరణ చేయలేదని కుంటిసాకులు చెప్తున్నారు. అంతేకాకుండా పలు రైల్వే ప్రాజెక్టుల విషయంలో తెలంగాణ పట్ల కేంద్రం వివక్ష చూపుతూనే ఉంది. 2011లో వ్యాగన్ షెడ్డు ను మొదట సికింద్రాబాద్ డివిజన్‌కు కేటాయించిన కేంద్రం అక్కడ స్థల సేకరణ జాప్యం అవడం వల్ల ఆ ప్రాజెక్టును కాజీపేటకు తరలించి ఆనాడు రాష్ట్ర సర్కారు స్థల సేకరణ చేయకపోగా ప్రాజెక్టు రద్దయింది.. 2016 లో రూ. 500 కోట్ల అంచనా వ్యయంతో వ్యాగన్ పిరియడికల్ ఓవరాలింగ్ షెడ్డును మంజూ రు చేసినప్పటికీ మొన్నటి వరకు ఆ ప్రాజెక్టుకు నిధులు కేటాయించకుండా నేడు ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రధాని మోడీ శనివారం హనుమకొండలో శంకుస్థాపన చేశారు.

మనకు స్పష్టంగా బిజెపి ఎంతటి నీచ రాజకీయాలు చేస్తుందో అర్ధం అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం కోచ్ పరిశ్రమ ఏర్పాటుకై 300 ఎకరాలకు గాను తొలిదశగా ఉచితంగా 160 ఎకరాల స్థల సేకరణ చేసి రైల్వే అధికాలకు అప్పగించింది. అయినప్పటికీ కేంద్రం దున్నపోతు మీద వానపడ్డ చందాన వ్యవహరిస్తోంది.కోచ్ పరిశ్రమపై రవికుమార్ అనే సామాజికవేత్త గతంలో సమాచార హక్కు చట్టం- 2005 ద్వారా సమాచారం కోరగా స్పందించిన కేంద్రం తెలంగాణలో రైల్వేకోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయమని.. భవిష్యత్‌లో కూడా ఆ అవసరం లేదని సమాధానం ఇచ్చింది.. అంతేకాకుండా విభజన హామీల పట్ల సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా పీయూష్ గోయల్ ఒకానొక సందర్భంలో మాట్లాడారు.. హామీలు ఇచ్చిన వారిని అడగాలని బాధ్యతారహితంగా వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్య దేశంలో పార్లమెంటు అంతిమం కానీ అందుకు పూర్తి విరుద్ధంగా అలాంటి వ్యాఖ్యలు చేయడం బిజెపి ప్రభుత్వం ప్రజాస్వామ్య వ్యవస్థను ఎలా ఖూనీ చేస్తున్నారో అర్ధం అవుతుంది.

దేశంలో అవసరమైనన్ని కోచ్‌లు తయారు చేయగల పరిశ్రమలు ఇప్పటికే ఉన్నాయని ఇంకా పరిశ్రమల అవసరం లేదని.. పార్లమెంట్ సాక్షిగా చేసిన చట్టాన్ని అవహేళన చేస్తూ ప్రజాస్వామ్య వ్యవస్థను ఖూనీ చేసింది బిజెపి. అటు ఈ ప్రకటన చేస్తూనే మహారాష్ట్రకు చడీచప్పుడు లేకుండా కోచ్ ఫ్యాక్టరీని తరిలించింది. దక్షిణాది వాళ్ళు కోరుకుంటారు, ఉద్యమిస్తారు. కానీ ఉత్తరాది వాళ్ళ కు అడక్కుండానే ఇస్తారు.. ఇలా కేంద్రంలోని బిజెపి తెలంగాణ రాష్ట్రంపై తన అక్కసును వెళ్లబోస్తూనే ఇలా ఎన్నికల సమయంలో ఎదో సవతి తల్లి ప్రేమను చూపిస్తుంది… విభజన హామీలైన బయ్యారం ఉక్కు పరిశ్రమ, ములుగులో గిరిజన విశ్వవిద్యాలయం, ఐటిఐఆర్ ప్రాజెక్టుల విషయంలో తెలంగాణకు తీరని అన్యాయం చేస్తూనే వస్తుంది.డివిజన్ కాగల అన్ని అర్హతలు కాజీపేట జంక్షన్‌కు ఉన్నాయి. కోచ్ పరిశ్రమతో పాటు కాజీపేట రైల్వేస్టేషన్‌ను డివిజన్‌గా చూడడం తెలంగాణ ప్రజల దశాబ్దాల ఆకాంక్ష. చాలా న్యాయ సమ్మతమైన, సహేతుకమైన డిమాండ్. అది వారి రాజ్యాంగబద్ధమైన హక్కు. అన్ని రకాల అవకాశాలు, అర్హతలు ఉన్నప్పటికీ ఇప్పటికీ ఇంకా జంక్షన్‌గానే కొనసాగిస్తున్నారు.

కాజీపేటను వదిలిపెట్టి అవసరం లేని, అర్హతలు లేని స్టేషన్లను డివిజన్‌గా మార్చారు (ఉదా॥ ఆంధ్రప్రదేశ్‌లో అతి కొద్ది దూరంలోనే ఉన్న విజయవాడ, గుంటూర్లను డివిజన్లుగా మార్చారు)సౌత్ సెంట్రల్ రైల్వేలో దాదాపు 50% ఆదాయం కాజీపేట జంక్షన్ నుండే ఉంటుంది. ఇతర అన్ని జంక్షన్ల కంటే ఎక్కువ సంఖ్యలో (12,000 మంది) ఉద్యోగులు ఉన్నారు. 18,000 విశ్రాంత ఉద్యోగుల కుటుంబాలు ఉన్నాయి. ప్రతిపాదిత కాజీపేట డివిజన్ పరిధిలో మూడు జంక్షన్లు ఉన్నాయి. అధికారికంగా పెద్దపల్లి, డోర్నకల్, కారెపల్లి.. అనధికారికంగా మానిగర్, జగ్గయ్యపేట జంక్షన్లు ఉన్నాయి. మొత్తం 83 స్టేషన్లు ఈ ప్రతిపాదిత డివిజన్ పరిధిలో ఉన్నాయి. ఈ డివిజన్ పరిధి హైదరాబాద్ రైల్వే మార్గంలో పెంబర్తి స్టేషన్ వరకు, విజయవాడ మార్గంలో కొండపల్లి స్టేషన్ వరకు, భద్రాచలం మార్గంలో మణుగూరు వరకు, ఢిల్లీ మార్గంలో మానిగర్ వరకు పరిధి ఉండేలా డివిజన్ ఏర్పాటు చేసే అవకాశం ఉన్నప్పటికీ.. కేంద్ర సర్కారుకు బహుశా అవి అర్హతలుగా కనిపించడం లేదేమో..!

కోచ్ పరిశ్రమను తెలంగాణకు కేటాయించాల్సిన అవసరం ఉన్నప్పటికీ తన మొండి వైఖరిని ప్రదర్శించింది. కాజీపేటలో రైల్వే వ్యవస్థపై ఆధారపడి లక్షల మంది బతుకుతున్నారు. వారి బతుకులను మెరుగుపరచడానికి ఆ ప్రాంతానికి కోచ్ పరిశ్రమ అత్యంత అవసరం. కోచ్ పరిశ్రమ కాజీపేటలో ఏర్పాటు చేస్తే రైల్వే కనెక్టివిటీ పెరుగుతుంది. వరంగల్ ప్రాంతంలో రైల్వే అనుబంధ రంగాల్లో భారీగా పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. కోచ్ పరిశ్రమ కోసం తెలంగాణ ప్రభుత్వం రాంపూర్, మడికొండ ప్రాంతాల్లో 2000 ఎకరాల భూమిని సేకరించి అందించేందుకు సిద్ధంగా ఉంది. అయినప్పటికీ కేంద్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నది.
కోచ్ ఫ్యాక్టరీ తెలంగాణకు మంజూరు చేయాల్సిన బాధ్యత కేంద్రానికి ఉన్నప్పటికీ తమాషా చేస్తున్నది. విభజన హక్కుల కోసం పోరాడాల్సిన తెలంగాణ బిజెపి కేంద్ర

పర్యాటక శాఖ మంత్రి, ఇటీవల రాష్ట్ర బిజెపి అధ్యక్షులైన కిషన్ రెడ్డి తెలంగాణకు పర్యాటకుడిగానే వ్యవహరించారు. బడ్జెట్‌లో తెలంగాణకు హక్కుగా రావాల్సిన నిధులను తీసుకురావడంలో విఫలమయ్యారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం కేవలం ఉత్తరాది ప్రభుత్వమే అని మరోసారి రుజువైంది. ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం పబ్లిక్ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేస్తూ జాతికి తీరని అన్యాయం చేస్తోంది. సంస్థలను జాతికి అంకితం చేసిన ప్రభుత్వాలను చూశాం కానీ ఇలా లాభాల్లో నడుస్తున్న సంస్థలను నష్టాల సాకుతో ప్రైవేటుపరం చేస్తున్న ఏకైక ప్రజా వ్యతిరేక ప్రభుత్వంగా బిజెపి చరిత్ర పుటల్లోకి ఎక్కుతున్నది. లాభాలతో నడిచే పలు రైల్వేస్టేషన్లను, రైల్వే మార్గాలను ప్రైవేటుపరం చేసేందుకు పూనుకుంది.తెలంగాణకు దక్కాల్సిన రైల్వే కోచ్ పరిశ్రమ, విభజన హామీలను విస్మరించిన బిజెపి తెలంగాణ కనుమరుగు కాకతప్పదు. ఉత్తరాది రాష్ట్రాల కోసమే అన్నట్లు మరి ముఖ్యంగా ఎన్నికలు జరుగుతున్న

రాష్ట్రాల కోసమే బడ్జెట్ ప్రవేశపెడుతూ కేంద్రం తన వంకర బుద్ధిని మరోసారి బయటపెట్టింది. కోచ్ ఫ్యాక్టరీ సాధనకై కాజీపేట ప్రాంత ప్రజలు ఉద్యమించారు. గత కొన్ని నెలలుగా రైల్వే జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యం లో అఖిలపక్షం, యువత, వ్యాపారస్థులు, విశ్రాంత ఉద్యోగులు, పలు యూనియన్ల నాయకులు పలు రకాలుగా నిరసనలు తెలుపుతున్నప్పటికీ కేంద్రానికి చీమకుట్టినట్లు కూడా లేకపోవడం చాలా బాధాకరం. పార్టీల జెండాలను పక్కన పెట్టి తమ ప్రాంత ప్రయోజన కోసం కలిసొచ్చే పార్టీలతో పోరాటం సాగిస్తూనే ఉన్నాయి. దశాబ్దాల కాజీపేట కోచ్ పరిశ్రమ, డివిజన్ అంశాన్ని నెరవేర్చకపోతే కేంద్ర ప్రభుత్వానికి పుట్టగతులుండవ్.. కోచ్ ఫ్యాక్టరీ వస్తే ఉపాధి వస్తుందని, తమ బతుకులు బాగుపడుతాయని ఆశించిన యువత నోట్లో మట్టి కొడుతూ.. ప్రాధాన్యత లేని వ్యాగన్ పరిశ్రమను అంటగట్టి నిన్న ప్రధాని నరేంద్ర మోడీ తమ రాజకీయ ప్రయోజనం కోసం కాజీపేటలో వ్యాగన్ పరిశ్రమకు శంకుస్థాపన చేసిన సందర్భంగా..

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News