Saturday, January 11, 2025

దయలేని రైల్వే

- Advertisement -
- Advertisement -

Former Japanese Prime Minister assassinated ముసలితనం మనిషిని ఎంతగా కుంగదీస్తుందో కేంద్ర ప్రభుత్వానికి వివరించి చెప్పాలా, సర్వశక్తులు ఉడిగిపోయిన తర్వాత వృద్ధాప్యం ఎన్ని బాధలకు గురి చేస్తుందో వివరించాలా… అవసరం లేదు. వయోవృద్ధులను సీనియర్ సిటిజెన్లు గా పరిగణించి దేశదేశాల్లో ప్రభుత్వాలు వారికి పలు సౌకర్యాలు కలిగిస్తున్నాయి. బ్రిటన్‌లో సహాయకులను పెట్టుకునేందుకు ప్రత్యేక అలవెన్స్ కూడా ఇస్తారు. మన దేశంలో మాత్రం స్వాతంత్య్ర అమృతోత్సవాలు జరుపుకొంటున్న శుభవేళ సీనియర్ సిటిజన్ల రైలు ప్రయాణ రాయితీలను కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తొలగించింది. వాటిని తిరిగి కల్పించబోమని ప్రభుత్వం స్పష్టంగా ప్రకటించింది. రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ పది రోజుల క్రితం ఇందుకు సంబంధించిన ఒక ప్రశ్నకు లోక్‌సభలో సమాధానం చెబుతూ సీనియర్ సిటిజన్ల రాయితీలను పునరుద్ధరించడం అభిలషణీయం కాదన్నారు.

ప్రయాణ రాయితీల భారం రైల్వేలకు అలవికానిదయ్యిందని చెప్పారు. 60 ఏళ్లు అంతకు మించి వయసున్న పురుషులకు, 58 సంవత్సరాలు, ఆ పై వయసులోని మహిళలకు రైల్వేలో ప్రయాణ రాయితీ ఇంతకు ముందు ఉండేది. ఈ రాయితీ టికెట్ రేటులో మహిళలకు 50 శాతం, పురుషులకు 40 శాతంగా వర్తించేది. కొవిడ్‌ను కారణంగా చూపి 2020 మార్చిలో ఈ రాయితీని నిలిపివేశారు. ఇప్పుడు దాన్ని పూర్తిగా రద్దు చేశారు. క్రీడాకారుల రాయితీని సైతం తొలగించారు. సీనియర్ సిటిజెన్ల ప్రయాణ రాయితీల వల్ల 2019-20 ఆర్ధిక సంవత్సరంలో రైల్వే రూ.1667 కోట్లు నష్టపోయిందని మంత్రి చెప్పారు.అయితే ఎసి తరగతుల్లో రాయితీలను రద్దు చేసి సాధారణ, స్లీపర్ తరగతులకు వాటిని పునరుద్ధరిస్తారని ఈ మధ్య ఊహాగానాలు ప్రచారంలోకి వచ్చాయి.

వాటిని కూడా వమ్ము చేస్తూ మొత్తం సీనియర్ సిటిజెన్‌ల రాయితీలన్నింటికీ రైల్వే మంగళం పాడింది. సీనియర్ల రాయితీలను భరించలేకపోతున్నామని, స్వచ్ఛందంగా వాటిని వదులుకొంటే బాగుంటుందని కొంతకాలం పాటు ఒక విజ్ఞప్తిని రైల్వేచేస్తూ వచ్చింది. దానికి తగిన స్పందన కరవు కావడంతో నేరుగా రాయితీలను రద్దు చేసింది. మర్యాదగా డబ్బు జేబులోంచి తీసి ఇవ్వకపోతే జబర్దస్తీగా తీసుకొన్న చందంగా వ్యవహరించింది. దాదాపు నాలుగున్నర కోట్ల మంది సీనియర్ సిటిజన్ల రైలు ప్రయాణ రాయితీలకు స్వస్తి చెప్పిన ప్రధాని మోడీ ప్రభుత్వం భవిష్యత్తులో రైల్వేను మొత్తంగా ప్రైవేటురంగం చేతిలో పెట్టినప్పుడు దానికి భారం కాకుండా ఉండడానికే ఈ చర్యకు పాల్పడిందనే అభిప్రాయం కలగడం సహజం. అనివార్యంగా ఒక వర్గానికి ఉచితంగా కల్పించే రాయితీలు భారమనిపించినప్పుడు, సరకు రవాణా నుంచో, ఇతరత్రానో ఆ నష్టాన్ని పూడ్చుకొంటారు. ప్రయాణీకుల అత్యవసరాన్ని బట్టి జారీ చేసే తత్కాల్ వంటి టికెట్ల మీద అదనపు భారంవేసి ఆ నష్టాన్ని భర్తీ చేసుకొంటారు.

వయసు మళ్ళి చేతి కర్ర ఊతం మీద నడిచే వృద్ధులకు రాయితీని కొనసాగించడం రైల్వే కి మోయలేనంత బరువు కాజాలదు. కాని బిజెపి ప్రభుత్వం ఉచితాలకు, రాయితీలకు వ్యతిరేకమైనది.అదే సమయంలో బడా కార్పొరేట్ శక్తుల లాభాలకు దేశాన్ని జనహితాన్ని బలి ఇవ్వడానికి ఎంత మాత్రం వెనుకాడదు. సీనియర్ సిటిజన్ల రాయితీలను రద్దు చేసిన రైల్వే, పార్లమెంటు సభ్యుల కింద మాత్రం గణనీయమైన రాయితీలు భరిస్తున్నది. ఎమ్‌పి దంపతులకు ఉచిత ఫస్ట్ క్లాస్ ఎసి, సహాయకులకు 2 టైర్ ఎసిలో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నది. వృద్ధాప్యంలో ప్రభుత్వం తమకు రాయితీ కల్పిస్తున్నదన్న భావన వారికెంతో ఊరటను ఇస్తుంది. అది జాతికి గర్వకారణమౌతుంది. ఇతర దేశాల్లో సీనియర్ సిటిజన్లకు రైలు ప్రయాణ రాయితీలను ఘనంగా కల్పిస్తున్నారు.

ఫ్రాన్స్‌లో 60, అంతకు మించిన వయసులోని వారికి 25-50 శాతం రాయితీ ఇస్తున్నారు. అలాగే జర్మనీ, బెల్జియంలో కూడా 65 ఏళ్ళు, ఆ పై వయసు వారికి రైల్వే రాయితీ ఉంది. బ్రిటన్‌లో దీనితో బాటు రైలు చార్జీలో మూడోవంతు రాయితీ ఉంటుంది. ఒకే యాజమాన్యం కింద నడుస్తున్న రైల్వేలలో ప్రపంచంలోనే రెండవ అతి పెద్ద సంస్థ అయిన భారతీయ రైల్వే తన సీనియర్ల పట్ల నిర్దాక్షిణ్యంగా ఉండడం తీవ్ర అప్రతిష్ఠాకరం. ఇది దానికి మాయని మచ్చ. ఈ రాయితీల రద్దు నిర్ణయాన్ని రద్దు చేసుకోడమే కేంద్రం బాధ్యత. ప్రజలకు ఉన్నవన్నీ ఊడ్చేసి, చరమాంకంలో చేతికర్ర మాదిరిగా ఉపయోగపడుతున్న రైల్వే ప్రయాణ రాయితీలకూ ఎసరుపెట్టి ఆజాదీ కా అమృతోత్సవ్ అంటూ దేశభక్తి ఆలాపన చేయడంలో అర్ధం లేదు. బిలియనీర్లు అధిక సంఖ్యలో తయారవుతున్న దేశంలో, అతి సంపన్నుల జాబితా చాంతాడు మాదిరిగా పెరిగిపోతున్న చోట ఈ భారాన్ని వారి మీద వేసయినా వృద్ధులకు తిరిగి సకల రైల్వే రాయితీలు కల్పించాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News