దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్య
మనతెలంగాణ/హైదరాబాద్: దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్య మన్మాడ్ టు పర్భని సెక్షన్‌లో మంగళవారం తనిఖీలు చేపట్టారు. ఆయనతో పాటు నాందేడ్ డివిజనల్ రైల్వే మేనేజర్ ఉపీందర్ సింగ్, ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు. ముందుగా జిఎం మన్మాడ్ నుంచి తనిఖీలు ప్రారంభించారు. రన్నింగ్ రూమ్‌లో అందుబాటులో ఉన్న వసతులను జిఎం పరిశీలించి అక్కడి సిబ్బందితో ఆయన మాట్లాడారు. రిలే రూమ్‌ను, టికెట్ తనిఖీ సిబ్బంది వసతి భవనాన్ని పరిశీలించిన జిఎం అక్కడ అభివృద్ధి కోసం చేపట్టాల్సిన ప్రణాళికలపై అధికారులతో చర్చించారు. అనంతరం
నాగర్‌సోల్ వద్ద గూడ్స్ సైడింగ్‌లో జిఎం విస్తృత తనిఖీలు చేపట్టారు. ఉల్లిపాయల వ్యాపారులు, సరుకు రవాణా వినియోగదారులతో సమావేశమై గజానన్‌మాల్య సరుకు రవాణాకు సంబంధించి స్టేషన్ నుంచి లోడింగ్‌లో మరింత అభివృద్ధి పనులు చేపట్టాలని జిఎం పలు సూచనలు చేశారు. దీంతోపాటు రోటేగావ్ రైల్వే స్టేషన్‌లో ప్రయాణికుల వసతులను, స్టేషన్ మేనేజర్ కార్యాలయాన్ని, సర్క్యులేటింగ్ ఏరియాను జిఎం పరిశీలించారు. ఔరంగాబాద్ రైల్వే స్టేషన్ వద్ద స్టేషన్ పరిసరాలను తనిఖీ చేసిన జనరల్ మేనేజర్ ఎలక్ట్రానిక్ వేయింగ్ బ్రిడ్జీ (మిషన్)ను ప్రారంభించారు. దీంతోపాటు జాల్నా రైల్వే స్టేషన్‌ను తనిఖీ చేసిన జిఎం అధికారులకు పలు సూచనలు చేశారు.