Thursday, January 23, 2025

రైల్లో రైల్వే పోలీసు జవాను కాల్పులు

- Advertisement -
- Advertisement -

ముంబై : మహారాష్ట్రలో ఓ రైల్వేగార్డు చేతన్‌సింగ్ సోమవారం ప్రయాణిస్తున్న రైలులో దారుణానికి పాల్పడ్డాడు. తన చేతుల్లోని రైఫిల్ తీసుకుని ఈ రైల్వేప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పిఎఫ్) కానిస్టేబుల్ ఏకంగా 12 రౌండ్లు కాల్పులు జరపడంతో నలుగురు మృతి చెందారు. మృతులలో ఒకరు సీనియర్ అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ కూడా ఉన్నారు. మిగిలిన ముగ్గురు ప్రయాణికులు. సోమవారం ఉదయం మహారాష్ట్రలోని ఫల్ఘార్ రైల్వే స్టేషన్ వద్ద రైలులో ఈ ఘటన జరిగిందని అధికారులు తెలిపారు. జైపూర్ ముంబై సెంట్రల్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (నెంబరు 12956)లో ఈ ఘాతుకానికి పాల్పడి చల్లగా జారుకునేందుకు యత్నించిన ఈ వ్యక్తిని తరువాత పట్టుకున్నారు.

తూటాల ధాటికి రైలులోని అద్దాలు తలుపులు పగిలాయి. బోగీలలో విధ్వంసకర పరిస్థితి ఏర్పడింది. తెల్లవారుజామున ఐదుగంటల ప్రాంతంలో చేతన్‌సింగ్ విధులకు వాడే తన ఆటోమెటిక్ అసాల్ట్ రైఫిల్‌తో కాల్పులకు తెగబడ్డాడు. రైలు జైపూర్‌లో బయలుదేరి ముంబై వెళ్లుతున్నప్పుడు ఈ వ్యక్తి అరాచక రీతిలో వ్యవహరించినట్లు అధికారులు తెలిపారు. చేతన్‌సింగ్ జరిపిన కాల్పుల్లో ఆర్‌పిఎఫ్‌కు చెందిన తోటి ఎఎస్‌ఐ తికారామ్ మీనా , బోగీలో ఉన్న ముగ్గురు ప్రయాణికులు చనిపోయినట్లు నిర్థారించారు. టికారాం మీనా ఎస్కార్ట్ డ్యూటీ ఇన్‌చార్జీగా ఉన్నారు. టికారాం మీనా రాజస్థాన్‌లోని సవాయ్ మాధోపూర్ వాసి. చేతన్‌సింగ్ ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌కు చెందిన వాడు. వీరి వెంట ఉన్న మరో ఇద్దరు ఆర్‌పిఎఫ్ జవాన్ల నుంచి ఘటన సంబంధిత వివరాలను రికార్డు చేసుకున్నట్లు రైల్వే పోలీసు అధికారులు తెలిపారు.

చేతన్‌సింగ్ నిలకడలేని వ్యక్తి అని, ముక్కోపి,షార్ట్‌టెంపర్ వ్యక్తి అని, చీటికిమాటికి తగవులకు దిగే వ్యక్తి అని , రైలులో ఆయన ఎవరితోనూ గొడవ పడలేదని, అయితే ఉన్నట్లుండి తన సీనియర్ జవానుపై రైఫిల్‌తో కాల్పులు జరిపి తరువాత పలురౌండ్ల కాల్పులకు దిగాడని , ఎదురుగా కన్పించిన వారి ప్రాణాలు తీశాడని అధికారులు తెలిపారు. ఘటనపైవెస్టర్న్ రైల్వే ఆర్‌పిఎఫ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ప్రవీణ్ సిన్హా మీడియాకు వివరాలు అందించారు. కోచ్ నెంబరు 5లో ఈ ఆర్‌పిఎఫ్ బృందం వెళ్లుతోంది. చేతన్‌సింగ్ జరిపిన కాల్పుల్లో కోచ్ బి5లోని ఓ ప్రయాణికుడు, తరువాత కోచ్ ఎస్ 6 లోని ఇద్దరు ప్యాసింజర్లు బలి అయ్యారు. పాంట్రీకారులోకి కూడా తూటాలు దూసుకువెళ్లాయి. తరువాత రైలు బోరివాలి స్టేషన్‌కు చేరుకున్న తరువాత నాలుగు మృతదేహాలను జిఆర్‌పి, ఆర్‌పిఎఫ్ అధికారులు, సిబ్బంది వెలికితీశారు.

కాల్పుల్లో చనిపోయిన ప్రయాణికులను గుర్తించాల్సి ఉందని అధికారులు తెలిపారు. స్టేషన్ సమీపించగానే పారిపోవడానికి యత్నించిన జవానును అదుపులోకి తీసుకున్నారు. ఆయన వద్ద ఉన్న రైఫిల్‌ను స్వాధీనపర్చుకున్నారని ఆర్‌పిఎఫ్ ఓ అధికారిక ప్రకటన వెలువరించింది. ఈ ఘటనపై ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించారు. నిందితుడు లోయర్ పారెల్‌లో ఉద్యోగి. జవానును మీరారోడ్‌లో అతికష్టం మీద పట్టుకున్నారు. తాను తరచూ మానసిక వేధింపులకు గురవుతూ వస్తున్నానని, ఈ క్రమంలో విధుల్లో ఉన్నప్పుడు ఈ చర్యకు పాల్పడినట్లు చేతన్ సింగ్ తెలిపినట్లు వెల్లడైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News