రైళ్లను లెక్కించడమే మీ ఉద్యోగం!
తమిళనాడుకు చెందిన 28మంది నిరుద్యోగులకు కోట్లలో కుచ్చుటోపీ
ఢిల్లీలో ఉద్యోగాల పేరిట ముఠా దారుణం
న్యూఢిల్లీ : రైల్వేలో ఉద్యోగాల పేరిట తమిళనాడుకు చెందిన 28 మంది యువ నిరుద్యోగులను కోట్లాది రూపాయల కుచ్చుటోపీ పెట్టింది ఓ మోసగాళ్ల ముఠా. రైల్వే ఉద్యోగంలో శిక్షణ పేరుతో నెలరోజుల పాటు బాధితులను ఢిల్లీ రైల్వే స్టేషన్‌లోని వివిధ ప్లాట్ఫారాలపైన నిల్చోబెట్టారు. వచ్చి పోయే రైళ్ల వివరాలను నమోదు చేయడమే మీ పని అని చెప్పారు. దాంతో బాధితులు ఆ పనిలో మునిగిపోయారు. కాస్త ఆలస్యంగా తెలిసింది వీరికి తాము మోసపోయామని. మీకు ట్రావెల్ టికెట్ ఎగ్జామినర్(టిటిఇ), ట్రాఫిక్ అసిస్టెంట్స్, క్లర్కులు వంటి హోదాలలో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి వారి నుంచి రూ. 2 లక్షల నుంచి రూ. 24 లక్షల వరకు వసూలు చేశారు. ఢిల్లీ పోలీసులకు చెందిన ఆర్థిక నేరాల విభాగంలో నమోదైన ఫిర్యాదు ప్రకారం..మొత్తం 28 మంది నిరుద్యోగుల నుంచి రూ. 2.67 కోట్ల రూపాయలను వసూలు చేశారు.
ఈ ఏడాది జూన్, జులై మధ్య నెలరోజుల పాటు శిక్షణ ఇవ్వడంతోపాటు వారికి ఫోర్జరీ నియామక పత్రాలు కూడా ఇచ్చారని బాధితుల పక్షాన ఎం. సుబ్బుసామి అనే 70 ఏళ్ల వృద్ధుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మాజీ సైనికోద్యోగి అయిన సుబ్బుసామి ఈ మోసగాళ్ల ముఠాకు, నిరుద్యోగులకు మధ్య సంధానకర్తగా వ్యవహరించి తాను కూడా ఈ ముఠా వలలో చిక్కుకున్నారు. ఒక్కో అభ్యర్థి రూ. 2 లక్షల నుంచి రూ. 24 లక్షల వరకు సుబ్బుసామికి డబ్బు చెల్లించగా ఈ డబ్బును ఆయన తనను తాను ఢిల్లీలోని ఉత్తర రైల్వే కార్యాలయంలో డిప్యూటీ డైరెక్టర్‌గా చెప్పుకున్న వికాస్ రాణా అనే వ్యక్తికి చెల్లించారు. ముందుగా వీరికి కన్నాట్ ప్లేస్‌లోని రైల్వే సెంట్రల్ హాస్పిటల్లో మెడికల్ ఎగ్జామినేషన్ జరిపించారు.
ఆ తర్వాత శంకర్ మార్కెట్లోని ఉత్తర రైల్వేకు చెందిన జూనియర్ ఇంజనీర్ కార్యాలయంలో డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరిపారు. శిక్షణ కోసం ఇచ్చిన గుర్తింపు కార్డులు,శిక్షణ పూర్తి సర్టిఫికెట్ల, నియామక ఉత్తర్వులు వంటి డాక్యుమెంట్లన్నీ ఫోర్జరీవని తమకు ఆలస్యంగా తెలిసిందని సుబ్బుసామి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తనను ఎన్నడూ రైల్వే భవనంలోకి తీసుకెళ్లలేదని, తన వద్ద నుంచి డబ్బు భవనం వెలుపలే తీసుకున్నారని ఆయన తెలిపారు. అభ్యర్థులకు శిక్షణ పేరుతో ఢిల్లీ స్టేషన్‌లోని ప్లాట్‌ఫారాల పైన నిలబెట్టి వచ్చి పోయే రైళ్ల వివరాలు నమోదు చేయాలని చెప్పారని, తాము కూడా ఇదంతా నిజమేనని నమ్మామని బాధితులు ఆపోయారు.