రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఢిల్లీలోని రైల్ భవన్‌లో ‘ఆటోమేటిక్ రైలు రక్షణ వ్యవస్థ’ (ఎటిపి) కవచ్ 4.0 ఆధునిక వర్షన్ పురోగతిని సమీక్షించినట్లు అధికారులు సోమవారం వెల్లడించారు. కవచ్ 3.2 వర్షన్‌ను ఆమోదిత అధిక రద్దీ రూట్లలో అమరుస్తున్నట్లు రైల్వే అధికారులు తెలియజేశారు. స్వల్ప వ్యవధిలో విస్తృత రైల్వే నెట్‌వర్క్‌కు వర్తింపచేసేందుకు కొత్త రూట్లలో తాజా వర్షన్ అప్‌గ్రేడ్ చేయడం, ఏర్పాటు చేయడం ఒకేసారి జరుగుతుందని వారు తెలిపారు. వైష్ణవ్ కవచ్ 4.0 పురోగతిని ఈ నెల 22న సమీక్షించినట్లు వారు వెల్లడించారు.
‘4.1 వర్షన్ ఆధునిక దశ పరీక్షలో పాల్గొంటున్న కవచ్ తయారీదారులు ముగ్గురు దాని ప్రగతి నివేదికను మంత్రికి అందజేసినట్లు సీనియర్ రైల్వే అధికారి ఒకరు తెలిపారు. ఆధునిక వర్షన్ పురోగతిని మంత్రి సమీక్షించిన తరువాత అది సిద్ధమైన వెంటనే మిషన్ మోడ్‌లో దశల వారీగా కవచ్‌ను అమర్చాలని ఆదేశించినట్లు ఆయన తెలిపారు, కాగా, కవచ్ అభివృద్ధి రైల్వే భద్రతలో గణనీయమైన మైలురాయి అని రైల్వే మంత్రిత్వశాఖ చెబుతున్నది. ప్రపంచంలోని పలు ప్రధాన రైల్వే వ్యవస్థలు 1980 దశకంలో ఎటిపిను ప్రవేశపెట్టగా, భారతీయ రైల్వేలు 2016లో రైళ్ల ఢీ నిరోధక వ్యవస్థ (టిసిఎఎస్) తొలి వర్షన్ ఆమోదంతో ఈ ప్రస్థానాన్ని ప్రారంభించినటుల వైష్ణవ్ గతంలో పలు సందర్భాల్లో వెల్లడించారు.