హైదరాబాద్ : రైలు ప్రయాణ సమయంలో మహిళా ప్రయాణీకుల రక్షణ, భద్రతపై దక్షిణ మధ్య రైల్వే పోలీసులు దృష్టి సారించారు. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వేలోని రైల్వే రక్షణ దళం ఆధ్వర్యంలో ‘ఆపరేషన్ మేరి సహేలీ’ కార్యక్రమంలో పాల్గొన్నారు. మహిళలకు సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతిని కల్పించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ చొరవ భారతీయ రైల్వేలతో పాటు దక్షిణ మధ్య రైల్వే పోలీసులు కూడా చేపట్టడం గమనార్హం. రైలు ప్రయాణాల సమయంలో మహిళా ప్రయాణీకులకు అధిక భద్రతా భావాన్ని అందించడంతో పాటు భయపడకుండా ప్రయాణించేలా చేయడం ‘ఆపరేషన్ మేరి సహేలీ’ ప్రాథమిక లక్ష్యంగా పెట్టుకున్నారు.
దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని 6 డివిజన్లలోని 20 స్టేషన్లలో అక్టోబర్, 2020 నుండి కూడా ఆపరేషన్ మేరి సహేలీనీ ప్రారంభించారు. ఇందులో సికింద్రాబాద్ డివిజన్‌లో 5 స్టేషన్లు, హైదరాబాద్ డివిజన్‌లో 2 స్టేషన్లు, విజయవాడలో 4 స్టేషన్లు, గుంతకల్‌లో 4 స్టేషన్లు, గుంటూరులో ఒక స్టేషన్ , నాందేడ్‌లో 4 స్టేషన్లు ‘సహేలీ’ జట్లను కలిగి ఉన్నాయి. ఒక్కో టీమ్‌కి 2 నుండి 24 మంది సభ్యులతో పాటు అంకితమైన మహిళా సబ్ ఇన్స్‌పెక్టర్‌లు నాయకత్వం వహిస్తున్నారు. దక్షిణ మధ్య రైల్వే నుండి బయలుదేరు 15 రైళ్లలో ఈ జోన్ గుండా వెళ్ళే 35 రైళ్లలో మేరి సహేలీ జట్లు సహాయాన్ని ఆందజేస్తున్నాయి.
దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని మేరి సహేలీ బృందాల పనితీరు వారు హాజరైన రైళ్ల సంఖ్య, ప్రయాణీకులకు అందించిన సహాయం, ప్రయాణీకుల ద్వారా సేకరించిన స్పందన , అందించిన సేవల నాణ్యత ఆధారంగా వారి పని తీరును అంచనా వేయనున్నారు. 2023 సంవత్సరంలో జనవరి నుండి జూలై వరకు సహేలీ బృందాలు ప్రయాణీకుల భద్రత, సహాయాన్ని నిర్ధారించడంలో తమవంతు కృషిని చేశారు. ప్రయాణీకుల నుండి లభించిన ఫీడ్‌బ్యాక్ రేటింగ్‌లు బట్టి వారు సంతృప్తికరమైన సేవలు చేసిందీ.. లేనిది నిర్ధారించనున్నారు. ఈ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ మాట్లాడుతూ ఆపరేషన్ మేరి సహేలీని అమలు చేసినందుకు, మహిళా ప్రయాణీకులకు భద్రతా జాగ్రత్తల గురించి అవగాహన కల్పించినందుకు రైల్వే రక్షణ దళం సిబ్బందిని ఆయన అభినందించారు. మహిళా ప్రయాణీకుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఈ సందర్భంగా ఆదేశించారు.