Wednesday, January 22, 2025

రైల్వేలో ప్రతి మూడు రోజులకో ఉద్యోగిపై వేటు..!

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: పనితీరు సరిగా లేని, అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్న ఉద్యోగులపై రైల్వేశాఖ కొరడా ఝళిపిస్తోంది. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా గత 16 నెలలుగా ప్రతిమూడు రోజులకు ఓ ఉద్యోగిపై వేటు పడుతోంది. 2021 జులై నుంచి ఇప్పటివరకు 139 మంది ఉద్యోగులకు బలవంతంగా వీఆర్‌ఎస్ (స్వచ్ఛంద పదవీ విరమణ ) ఇచ్చి పంపించగా, మరో 38 మంది ఉద్యోగులను విధుల నుంచి తొలగించినట్టు రైల్వే అధికారి ఒకరు తాజాగా వెల్లడించారు. “ఉద్యోగుల పనితీరుపై కఠినంగా ఉండాలని, కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ చాలా స్పష్టంగా చెప్పారు. 2021 జులై నుంచి రైల్వే శాఖలో ప్రతి మూడు రోజులకు ఒక అవినీతి పరుడిని పంపించేశాం ” అని సదరు అధికారి పేర్కొన్నారు.

బుధవారం కూడా ఇద్దరు సీనియర్ గ్రేడ్ అధికారులను విధుల నుంచి తొలగించినట్టు సంబంధిత వర్గాల సమాచారం. ఇందులో ఒకరు హైదరాబాద్‌లో రూ. 5 లక్షల లంచం తీసుకుంటూ సీబీఐకి చిక్కగా, రాంచీలో మరో అధికారి రూ.3 లక్షలు తీసుకుంటూ అధికారులకు దొరికి పోయారని సదరు వర్గాలు తెలిపాయి. గత ఏడాది రైల్వే మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత ఉద్యోగుల పనితీరు విషయంలో కఠిన నిబంధనలు తీసుకొచ్చారు. విధులు సక్రమంగా నిర్వర్తించకపోతే వీఆర్‌ఎస్ తీసుకోవాలంటూ ఇప్పటికే కేంద్ర మంత్రి పలుమార్లు ఉద్యోగులను హెచ్చరించారు. అవినీతికి పాల్పడే వారిని తక్షణమే విధుల నుంచి తొలగించాలని నిర్ణయించారు. దీనిలో భాగం గానే పలువురు ఉద్యోగులపై వేటు పడింది. ఎలక్ట్రికల్, సిగ్నలింగ్, మెడికల్, స్పోర్ట్, మెకానికల్ విభాగాల్లో ఈ కోతలు ఉన్నట్టు తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News