Saturday, January 11, 2025

కోరమండల్ నేపథ్యంలో కాగ్ నిజాలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : గత ఏడాది సెప్టెంబర్‌లో పార్లమెంట్‌లో రైల్వేల భద్రత సంబంధిత అంశాలపై ఆడిట్ నివేదికను ప్రవేశపెట్టారు. ఇందులో పలు అంశాలను ప్రస్తావించారు. ప్రత్యేకించి రైల్వే భద్రత వైఫల్యాలు అనేకం ఉన్నాయని తెలిపారు. పార్లమెంట్ సాక్షిగా దీనిపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అయింది. జాగ్రత్త చర్యలకు పిలుపులు వెలువడ్డాయి. కంప్ట్రోలర్ ఆడిట్ జనరల్ (కాగ్) వెలువరించిన నివేదికలో రైళ్లు పట్టాలు తప్పడంపై కీలక విషయాలను ప్రస్తావించింది. రైళ్ల పట్టాల దుర్ఘటనలు, ఢీకొనడాలు వంటివి ఎక్కువగా సరైన నిశిత పర్యవేక్షణ , క్షేత్రస్థాయి పరిశీలన తనిఖీలు లేకపోవడం వల్లనే జరుగుతున్నాయని తెలిపారు. నిజానికి వాస్తవిక ట్రాక్ చెక్‌కు అవసరం అయిన క్షేత్రస్థాయి సిబ్బంది ఉందా? అనేది ప్రశ్న. పైగా ప్రమాదాలు జరిగినప్పుడు హడావిడిలు తప్పితే తరువాత దర్యాప్తు నివేదికలు ఎం చెప్పాయి?

వాటికి అనుగుణంగా చర్యలు చేపడుతున్నారా? అనేది మరో ప్రమాదం జరిగినప్పుడే వెలుగులోకి వస్తున్నాయి. ఇదో తంతుగా మారుతోంది. 30 నుంచి 100 శాతం వరకూ ట్రాక్ రికార్డింగ్ వాహనాలతో జరిగే తనిఖీలలో లోపాలే ప్రమాదానికి దారితీస్తున్నట్లు వెల్లడించారు. ట్రాక్‌లపై ప్రత్యేకమైన మలుపులు, భౌగోళిక క్షీణ స్థితి ఉండే చోట తీసుకోవల్సిన జాగ్రత్తల్లో నిర్లక్షం కన్పిస్తోంది. ట్రాక్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ లోపాలే ప్రమాదానికి కారణం అని తెలిపారు. ట్రాక్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (టిఎంఎస్) వెబ్ ఆధారిత ఆచరణలో ఆన్‌లైన్ పర్యవేక్షణలో సాగే ట్రాక్ నిర్వహణ వ్యవస్థగా ఉంటోంది. ఇప్పుడు ఒడిషాలో జరిగిన ఘోర రైలు ప్రమాదానికి కారణం ఈ ట్రాక్ నిర్వహణ లోపాలే అని వెల్లడవుతోంది.

ఇక ఇంతకు ముందటి దర్యాప్తుల నివేదికలను సంబంధిత అధికారుల యంత్రాంగానికి కానీ పార్లమెంట్ పరిశీలనకు కానీ సమర్పించకపోవడం ప్రధాన విషయం అయింది. పైగా నిర్ణీత వ్యవధిలో పలు నివేదికలు వెలువడటం లేదు. దీనితో ప్రమాద తీవ్రతలను విస్మరించే పరిస్థితి ఏర్పడుతోందని కాగ్ నివేదికలో తెలిపారు. ఇక రైలు సంరక్ష కోష్ అంటే రైల్వే భద్రతకు ఉద్ధేశించిన మొత్తం వ్యయం రూ 1 లక్ష కోటి నిధిగా ఐదేళ్ల కాలానికి సంబంధించి ఉంది. అయితే సంబంధిత కోటా పరిధిలో ఏ మేరకు వ్యయం అవుతోంది? దీని వల్ల ఎటువంటి సత్ఫలితాలు వెలువడుతున్నాయనేది కీలక ప్రశ్న అయిందని పార్లమెంట్‌కు సమర్పించిన కాగ్ నివేదికతోనే వెల్లడైంది. కోరమండల్ ఎక్స్‌ప్రెస్ దుర్ఘటన క్రమంలో ఈ కాగ్ నివేదిక గురించి ఏమి చేశారనే ప్రశ్నలు ఇప్పుడు కేంద్రానికి తగులుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News