Monday, December 23, 2024

ప్రాణ నష్టం నివారణకే కాల్పులు

- Advertisement -
- Advertisement -

 

ఆయిల్ నిల్వలపై ఆందోళన కారుల దాడీకి యత్నం
ఘటనలో 2వేల మంది ఆర్మీ 
దాడుల్లో 9మంది పోలీసులు, 16మంది అభ్యర్థులకు గాయాలు
46మందిపై కేసులు నమోదు, 30 ట్రైన్ కోచ్‌లు ధ్వంసం
రూ.20 కోట్ల రైల్వే ఆస్తుల నష్టం: రైల్వే ఎస్‌పిఅనురాధ వెల్లడి

మనతెలంగాణ/హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఆందోళనకారుల ప్రాణాలను రక్షించేందుకే పోలీసులు కాల్పులు జరిపారని రైల్వే ఎస్‌పి అనురాధ వెల్లడించారు. సికిందరాబాద్ రైల్వే పోలీసు కార్యాలయంలో ఆదివారం మీడియా సమావేశంలో ఎస్‌పి అనురాధ దాడులకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఎస్‌పి మాట్లాడుతూ అల్లర్ల జరిగే ప్రాంతంలో పవర్ కార్‌లో 4వేల లీటర్ల హెచ్‌ఎస్‌డి ఆయిల్, లోకో ఇంజిన్‌లో 3వేల లీటర్ల ట్రాన్స్‌ఫార్మర్‌ల ఆయిల్ ఉందని అలాగే ఆయిల్ నిల్వ చేసే ఆర్‌సిడి డిపో ఉందన్నారు. ఆందోళన కారులు విధ్వంసంలో భాగంగా ఆయా ప్రాంతాలకు సమీపంలోకి వెళుతున్న క్రమంలో జిఆర్‌పి పోలీసులు కాల్పులు జరిపారని, లేనిపక్షంలో ఆయిల్ నిల్వలకు మంటలంటుకుంటే భారీ విధ్వంసం జరిగి ఉండేదన్నారు. సికిందరాబాద్ రైల్వే స్టేషన్‌లో భారీ ప్రమాదాన్ని నిలువారించడానికే రైల్వే రక్షక దళం పోలీసులు 20 రౌండ్ల కాల్పులు జరిపారని ఎస్‌పి తెలిపారు. ఆందోళన కారుల ప్రాణాలను రక్షించేందుకే ఆర్‌పిఎఫ్ పోలీసులు ఒక బులెట్‌తో పాటు మరో 20 పిల్లేట్స్ కాల్పులు జరిపారన్నారు. అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో విధ్వంసానికి పాల్పడిన వారిలో ఇప్పటివరకు 46 మందిని అరెస్టు చేశామని, ఈ ఘటనలో మిగిలిన వారికోసం గాలిస్తున్నట్లు చెప్పారు. ఆర్మీ అభ్యర్థుల వాట్సాప్ గ్రూపుల్లో వచ్చిన మెసేజ్‌ల ఆధారంగా దర్యాప్తును వేగవంతం చేసి అన్ని కోణాల్లో వివరాలు సేకరిస్తున్నామన్నారు. ఆందోళన కారుల దాడుల్లో ఈస్ట్‌కోస్ట్, అజంతా ఎక్స్‌ప్రెక్స్, రాజ్‌కోట్ ఎక్స్‌ప్రెక్స్, గరీబ్థ్,్ర శబరి, రాయ్‌పూర్ ఎక్స్‌ప్రెక్స్‌లతో పాటు మూడు లోకో ఇంజిన్, యాక్సిడెంటల్, మెడికల్ రిలీఫ్ ట్రైన్స్ వెరసి రూ. 20 కోట్ల మేర రైల్వే ఆస్తులను ఆందోళన కారులు ధ్వంసం చేశారని తెలిపారు. రైల్వే స్టేషన్‌లో ఆందోళన కారుల దాడుల్లో 9మంది పోలీసులు, 16మంది అభ్యర్థులకు గాయాలయ్యాయన్నారు.
సికింద్రాబాద్ స్టేషన్‌లో రైల్వే ఆస్తులను ధ్వంసం చేయాలని ఆర్మీ అభ్యర్థులు ముందే ప్రణాళిక రచించుకున్నారని ఎస్‌పి అనురాధ తెలిపారు. తమకు ట్రైనింగ్ ఇచ్చిన కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు రైల్వే స్టేషన్‌పై దాడి చేయమని సలహా ఇవ్వడంతో ఈనెల 16నే వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసుకున్నారన్నారు. అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేసుకుంటూ రైల్వే స్టేషన్‌ను ధ్వంసం చేశారని, ఆందోళనకారులంతా ఆర్మీ అభ్యర్థులేనని తెలిపారు. వీరికి ఫిజికల్ టెస్టులు పూర్తి అయ్యాయని, అగ్నిపథ్ వల్ల తమకు అన్యాయం జరుగుతుందని అభ్యర్థులు ఈ దాడికి దిగారన్నారు. ఈ కేసు దర్యాప్తులో మరి కొందరిని అరెస్టు చేసే అవకాశం ఉందని, ఈ కేసును హైదరాబాద్ పోలీసులకు అప్పగించామని ఎస్‌పి వివరించారు. ఈనెల 17 వ తేదీన ఉదయం 8 గంటలకు 300 మంది చొరబడి 30 రైల్వే కోచ్‌లను ధ్వంసం చేశారని తెలిపారు. ఒక కోచ్ ను పెట్రోల్ పోసి కాల్చేశారని, అగ్నిపథ్‌కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వచ్చారన్నారు. అయితే వీరు ముందస్తుగా రైల్వే స్టేషన్ బ్లాక్, ఇండియన్ ఆర్మీ గ్రూప్, హకీంపేట్ ఆర్మీ సోల్జర్స్ గ్రూప్, ఛలో సికిందరాబాద్ ఎఆర్‌వొ గ్రూప్, ఆర్మీ జిడి 2021 మార్చ్‌ర్యాలీ, సిఇఇ సోల్జర్స్ గ్రూప్, సోల్జర్స్ టు డై గ్రూప్‌లలో సందేశాలు పంపుతూ ఒక్కసారిగా అభ్యర్థులు సికిందరాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారని ఎస్‌పి వివరించారు.
నిందితులపై కేసులు
రైల్వే స్టేషన్‌లో విధ్వంసానికి పాల్పడిన నిందితులపై ఐపిసి 143, 147, 324, 307, 435, 427, 448, 336, 332, 341 రెడ్ విత్ 149, ఐఆర్ యాక్ట్ 150, 151, 152, పిడిపిపి యాక్ట్ సెక్షన్ 3 అండ్ 4 కింద కేసులు నమోదు చేసినట్లు రైల్వే ఎస్‌పి అనురాధ తెలిపారు. ఇప్పటి వరకు 46 మంది పై కేసు నమోదు చేశామన్నారు. ఈ కేసులోని నిందితులకు జీవిత కాలం శిక్ష వాళ్ళకీ పడే అవకాశం ఉందని, రైల్వే యాక్ట్ ప్రకారం వీళ్ళకి ఇక ప్రభుత్వ ఉద్యోగం రాక పోవచ్చని ఎస్‌పి వివరించారు.

Railway SP Press Meet over Secunderabad Violence

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News