Friday, December 20, 2024

విమాన ఛార్జీలకు పోటీగా రైల్వే టికెట్లు !

- Advertisement -
- Advertisement -

Railway tickets to compete for airfare!

రెగ్యులర్ రైళ్లతో పోలిస్తే దాదాపు రెండింతల చార్జీల వసూలు
అదనపు చార్జీలను చెల్లించినా దొరకని బెర్తులు

మనతెలంగాణ/హైదరాబాద్ : విమాన ఛార్జీలతో పోటీగా రైలుల్లో ప్రయాణించడానికి టికెట్లకు డబ్బులు పెట్టాల్సి వస్తుందని ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. రైలు టికెట్ ధరలు కొన్ని సందర్భాల్లో విమాన ఛార్జీలను సైతం దాటి పోతుండటంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం జనరల్, రిజర్వేషన్ భోగీల్లో రిజర్వేషన్ జాబితా పెద్దగా ఉండడం, దూర ప్రయాణాలు చేసేవారు ఎసి బోగీల్లో వెళ్లడానికి సైతం ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో రెగ్యులర్ రైళ్లలో ఎసి బోగీలు తక్కువగా ఉండటంతో ప్రీమియం రైళ్లకు సైతం డిమాండ్ పెరుగుతోంది. రాజధాని, దురంతో (కొన్ని స్లీపర్ మినహా), శతాబ్ది, హమ్‌సఫర్ వంటి రైళ్లలో ఉండేవన్నీ దాదాపుగా ఎసి బోగీలే. వాటిలో వందలాది బెర్తులుంటాయి. అయితే ఈ రైళ్లలో టికెట్ ఛార్జీలు రెగ్యులర్ రైళ్లతో పోలిస్తే దాదాపు రెండింతల చార్జీలను రైల్వే శాఖ వసూలు చేస్తోంది. ప్రస్తుతం వేసవి సెలవులు నేపథ్యంలో అదనపు చార్జీలను చెల్లించడానికి ప్రయాణికులు ముందుకొచ్చిన బెర్తులు దొరకడం లేదని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

విమాన టికెట్ రూ.4,200 నుంచి రూ.5 వేలు…

హైదరాబాద్ నుంచి ఢిల్లీకి 2, 3 వారాల ముందు బుక్ చేసుకుంటే విమాన టికెట్ రూ.4,200 నుంచి రూ.5 వేలకు దొరుకుతుంది. అదే రాజధాని, దురంతో రైళ్లలో ఫస్ట్ ఎసి టికెట్‌కు రూ.5,865ల చార్జీని రైల్వే శాఖ వసూలు చేస్తోంది. విమాన ప్రయాణం 2 గంటలు కాగా, ప్రీమియం రైల్లో ఏకంగా 22 గంటలు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. తెలంగాణ ఎక్స్‌ప్రెస్ కంటే దురంతో రైలులోని థర్డ్ ఎసిలో రెట్టింపు ఛార్జీలను వసూలు చేస్తున్నారని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయినా కూడా టికెట్లు దొరకొడం లేదని వారు వాపోతున్నారు.

సికింద్రాబాద్ టు -బెంగళూరు రెగ్యులర్ రైళ్లతో పోలిస్తే రాజధాని ఎక్స్‌ప్రెస్ ఛార్జీలు దాదాపు రెండింతలుగా ఉన్నాయని ప్రయాణికులు పేర్కొంటున్నారు. ఒకవేళ ఈ రైలులో టికెట్ దొరికి ప్రయాణించాలంటే ఇతర రైళ్ల కంటే అధిక సమయం పడుతుందని ఇలా పలు రకాలుగా రైల్వే శాఖ ఇబ్బందులు సృష్టిస్తుందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రెగ్యులర్ రైళ్లలో థర్డ్ ఎసి టికెట్ రూ.985-లు

సికింద్రాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్లాలంటే రెగ్యులర్ రైళ్లలో థర్డ్ ఎసి టికెట్ రూ.985-లు, రూ.1,005 ఉండగా రాజధానిలో రూ.1,885లను వసూలు చేస్తున్నారు. దీంతోపాటు సెకండ్ ఎసి సాధారణ రైళ్లలో రూ.1,415ల ధరతో పాటు రూ.2,565ల చార్జీలను రైల్వే శాఖ వసూలు చేస్తోంది. కాచిగూడ- టు మైసూర్ ఎక్స్‌ప్రెస్‌లో బెంగళూరుకు వెళితే ప్రయాణ సమయం 11 గంటల 20 నిమిషాలు కాగా అదే రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో అయితే 11 గంటల 55 నిమిషాల సమయం పడుతుందని ప్రయాణికులు పేర్కొంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News