Friday, December 20, 2024

అగ్నివీరులకు రైల్వే భారీ రాయితీలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద ఉద్యోగ కల్పన సంస్థ అయిన రైల్వేలు అగ్నివీరులకు భారీ తాయిలాలు ప్రకటించింది. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ కోటాలో లెవల్ 1పోస్టుల్లో పది శాతం అలాగే లెవల్2 పోస్టులు, అంతకు పైబడిన నాన్ గెజిటెడ్ పోస్టుల్లో 5 శాతం రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించినట్లు సంబంధిత వర్గాలు గురువారం తెలియజేశాయి. పిడబ్లుబిడి, మాజీ సైనికులు, సిసిఎఎలకు ఇచ్చినట్లుగా ఈ రిజర్వేషనుల ఉంటాయని ఆ వర్గాలు తెలిపాయి. అంతేకాకుండా అగ్నివీరులకు భౌతికసామర్థ్యం పరీక్షనుంచి కూడా మినహాయింపు ఇవ్వనున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి. అంతేకాకుండా వారికి వయోపరిమితిలో సడలింపు కూడా ఇస్తారు. లెవల్1, లెవల్2, కు అంతకుపైబడిన నాన్ గెజిటెడ్ పోస్టులకు నిర్దేశించిన వయో పరిమితికి మించి మొదటి బ్యాచ్ అగ్నివీరులకు అయిదేళ్లు, దరిమిలా బ్యాచ్‌లకు మూడేళ్లు మినహాయింపు ఇవ్వనున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి.

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డులు, విభాగాలు నిర్వహించే నియామకాల్లో సాయుధ దళాల్లో నాలుగేళ్ల సర్వీస్‌ను విజయవంతంగా పూర్తి చేసిన అగ్నివీరులకు ఈ సడలింపులు, సదుపాయాలు కల్పించాలని కోరుతూ రైల్వే బోర్డు జనరల్ మేనేజర్లు అందరికీ లేఖ కూడా రాసినట్లు ఆ వర్గాలు తెలిపాయి. కాగా భర్తీ కాని పోస్టులకు క్యారీ ఫార్వర్డ్ ఉండదని జిఎంలకు రాసిన లేఖలో రైల్వే బోర్డు స్పష్టం చేసింది. సాయుధ దళాల్లో నియామకాల కోసం కేంద్రప్రభుత్వం గత ఏడాది ప్రకటించిన అగ్నివీర్ పథకం కింద సాయుధ దళాల్లో నాలుగేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారిలో 25శాతం మందిని సైన్యంలో చేర్చుకుంటారు. మిగతా 75 శాతం వారికి ఆకర్షణీయమైన ప్యాకేజి అందించి ఇంటికి పంపిస్తారు. పలు కేంద్రమంత్రిత్వశాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలు వీరికి రిజర్వేషన్లు కల్పిస్తూ ఉద్యోగాల్లో చేర్చుకుంటున్నాయి. ఆ క్రమంలోనే రైల్వే కూడా వీరికి ఈ రాయితీలు ప్రకటించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News