న్యూఢిల్లీ: 58 వందేభారత్ రైళ్ల తయారీకి టెండర్లను ఆహ్వానిస్తూ రైల్వేశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇప్పటికే 44 వందేభాతర్ రైళ్లకు టెండర్లను ఆహ్వానించారు. దీంతో, వందేభారత్ రైళ్ల సంఖ్య 102కు చేరింది. వీటిని 2024 వరకల్లా తయారు చేయాలన్నది లక్షమని రైల్వేశాఖ అధికారి ఒకరు తెలిపారు. వీటిలో 75 రైళ్లను 2022 ఆగస్టు 23 వరకల్లా తయారు చేయాలి. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు నిండుతున్న సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. 75 వారాల్లో 75 వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను సిద్ధం చేయాలని ఈ ఏడాది స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా ప్రధాని మోడీ ప్రకటించారు. వాటిని దేశంలోని నలుమూలలకూ నడపాలని ప్రధాని సూచించారు. ఈ నేపథ్యంలోనే తాజాగా టెండర్లను ఆహ్వానించారు. టెండర్లు పంపడానికి అక్టోబర్ 20ని గడువుగా నిర్ణయించారు. టెండర్లు పంపేవారు తాము తయారు చేయనున్న రైళ్ల డిజైన్, ఇతర వివరాలను తెలియజేయాల్సి ఉంటుంది. 44 సెమీహైస్పీడ్ రైళ్ల కోసం గతేడాది జారీ చేసిన నోటిఫికేషన్‌లో 75 శాతం దేశీయ పరికరాలే ఉండాలని షరతు విధించడం గమనార్హం.