అందుబాటులోకి తీసుకొచ్చిన రైల్వేశాఖ
త్వరలోనే అన్ని రైళ్లలో బెర్త్‌ల ఏర్పాటు
మనతెలంగాణ/హైదరాబాద్ : రైలులో ప్రయాణించే తల్లీ, పిల్లల కోసం రైల్వే శాఖ సరికొత్త ప్రయోగాన్ని చేపట్టింది. అందులో భాగంగా చిన్న పిల్లలు పడుకోవడానికి ప్రత్యేకంగా లోయర్ బెర్త్ పక్కన వీటిని ఏర్పాటు చేస్తోంది. దీనికోసం లఖ్‌నవూ మెయిల్‌ను ఫైలెట్ ప్రాజెక్ట్‌గా ఎంపిక చేసింది. ప్రయాణికులకు సురక్షిత, సౌకర్యవంత ప్రయాణం అందించేందుకు రైల్వేశాఖ ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా పిల్లలతో కలిసి ప్రయాణించే తల్లుల కోసం ఈ సరికొత్త ఏర్పాట్లను ప్రవేశపెట్టింది. దీనికి ఫోల్డబుల్ ‘బేబీ బెర్త్’గా నామకరణం చేసింది. పిల్లల కోసం ప్రత్యేకంగా రూపొందించిన చిన్నపాటి పడకగా దీనిని రైల్వే శాఖ పరిగణిస్తోంది. ఇది లోయర్ బెర్త్‌కు అటాచై ఉంటుంది. ప్రయాణ సమయంలో తల్లులు ఈ బెర్త్‌పై తమ శిశువులను పడుకోబెట్టోచ్చు.
సాధారణంగా అయితే ఒకే బెర్త్‌పై తల్లీబిడ్డ సర్దుబాటు కావాల్సి ఉంటుంది. దీంతో స్థలం సరిపడక ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం ఏర్పాటు చేసిన బేబీ బెర్త్ సాయంతో చిన్నారులను తల్లులు తమ పక్కనే సురక్షితంగా పడుకోబెట్టుకునేలా రైల్వే శాఖ చర్యలు చేపట్టింది. ‘మదర్స్ డే’ సందర్భంగా ఉత్తర రైల్వే డివిజన్ ఈ కొత్త సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. లఖ్‌నవూ, ఢిల్లీ డివిజన్ల సమన్వయంతో లఖ్‌నవూ మెయిల్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లోని త్రీ-టైర్ బీ4 కోచ్‌లో ఈ బెర్త్‌లను పైలట్ ప్రాజెక్ట్‌గా ఏర్పాటు చేసింది. అవసరం లేనప్పుడు దీనిని లోయర్ బెర్త్ కిందకు మడతపెట్టేలా ఏర్పాట్లు చేశారు. 770 మి.మీల పొడవు, 255 మి.మీల వెడల్పు, 76.2 మి.మీల ఎత్తు కలిగిన ఈ బేబీ బెర్త్‌కు శిశువును సురక్షితంగా పట్టి ఉంచడానికి పట్టీలను సైతం ఏర్పాటు చేశారు.