పాట్నా: ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో శుక్రవారం సాయంత్రం మూడు రైళ్లు ఒకదాన్ని మరొకటి ఢీకొనడంతో కనీసం 290 మంది మరణించగా, దాదాపు 1000 మంది గాయాలపాలయ్యారు. ఈ ఉదంతంపై రాష్ట్రీయ జనతాదళ్ చీఫ్, మాజీ రైల్వే మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ శనివారం ప్రతిస్పందించారు. ఈ ప్రమాదంలో అనేక మంది చనిపోవడానికి కారణం నిర్లక్షం, అప్రమత్తంగా లేకపోవడం అన్నారు. ఎవరి పేరు ఎత్తకుండానే ఆయన ‘వారు రైల్వేస్‌ను నాశనం(చౌపట్) చేసేశారు’ అన్నారు.
బాలాసోర్ జిల్లాలో వరుసగా మూడు రైళ్లు ఒకదాన్ని మరొకటి ఢీకొన్నాయి. దేశంలో అత్యంత విషాదకర రైలు ప్రమాదాల్లో ఇదొకటిగా నిలిచింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా ఉంది. బహనాగ బజార్ స్టేషన్ వద్ద బెంగళూరుహౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, కోరమండల్ ఎక్స్‌ప్రెస్, గూడ్స్ రైలు ఒకదాన్ని మరొకటి ఢీకొట్టాయి. ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ‘ఈ రైళ్ల ప్రమాదంలో పెద్ద నిర్లక్షం ఉంది. వారు రైల్వేలను సర్వనాశనం చేశారు’ అని లాలూ ప్రసాద్ ఎఎన్‌ఐ వార్తా సంస్థతో అన్నారు. లాలూ ప్రసాద్ యాదవ్ 2004 నుంచి 2009 వరకు రైల్వే మంత్రిగా పనిచేశారు.
#WATCH | RJD chief & former Railways Minister Lalu Prasad Yadav speaks on #BalasoreTrainAccident; says, "…The manner in which they showed negligence & didn't show alertness led to such a large number of casualties…There should be a high-level inquiry and action should be… pic.twitter.com/01WgROya1t
— ANI (@ANI) June 3, 2023
ప్రాథమిక దర్యాప్తులో తప్పుడు సిగ్నల్ కారణంగానే ఈ రైలు ప్రమాదం జరిగిందని అంటున్నారు. గూడ్సు రైలు నిలిచి ఉన్న ట్రాక్‌లోకి కోరమండల్ ఎక్స్‌ప్రెస్ ప్రవేశించింది. దాంతో మూడు రైళ్ల ప్రమాదం జరిగింది. సీనియర్ రైల్వే అధికారుల ప్రిలిమినరీ దర్యాప్తులో 290 మంది చనిపోయారని, 900 మంది గాయపడ్డారని తెలిపారు. కోరమండల్ ఎక్స్‌ప్రెస్ గంటకు 128 కిమీ. వేగంతో, బెంగళూరుహౌరా ఎక్స్‌ప్రెస్ గంటకు 116 కిమీ. వేగంతో నడిచాయి. నివేదికను రైల్వే బోర్డ్‌కు సమర్పించారు. ఈ రెండు రైళ్లు దాదాపు 2000 మంది ప్రయాణికులను తీసుకెళుతున్నాయి.