బాంబే హైకోర్టు తీర్పు
బాధితుడికి రూ.3 లక్షలు పరిహారం ఇవ్వాలని ఆదేశం
ముంబయి: లోకల్ రైళ్లు ముంబయి నగరానికి జీవనాడి అని, కిక్కిరిసిన రైలు ఎక్కబోయి ఎవరైనా వ్యక్తి పడిపోతే అది అవాంఛనీయ ఘటన కిందికి వస్తుందని, రైల్వ్లే దానికి నష్టపరిహారం చెల్లించాలని బాంబే హైకోర్టు అభిప్రాయపడింది. విపరీతమైన రద్దీగా ఉన్న లోకల్ రైలు ఎక్కబోయి కిందపడి కాలికి గాయాలు తగిలిన 75 వృద్ధుడికి రూ.3 లక్షల నష్టపరిహారం చెల్లించాలని పశ్చిమ రైల్వే అధికారులను జస్టిస్ భారతీ దంగ్రే నేతృత్వంలోని సింగిల్ బెంచ్ ఆదేశించింది. ఈ నెల 12వ తేదీన ఇచ్చిన ఈ తీర్పు కాపీ మంగళవారం మీడియాకు అందుబాటులోకి వచ్చింది. అయితే పిటిషన్ దారు నితిన్ హండీవాలా కదులుతున్న రైలు ఎక్కబోయారని, అవాంఛనీయ ఘటన కేసుల్లో మాత్రమే నష్టపరిహారం చెల్లించాలని చెబుతున్న రైల్వే చట్టం 124(ఎ) కిందికి ఇది రాదని పశ్చిమ రైల్వే అధికారులు వాదించారు. అయితే రైల్వే వాదనను న్యాయమూర్తి అంగీకరించలేదు.
రోజూ ప్రయాణించేటప్పుడు ఒక ప్రయాణికుడు రద్దీగా ఉండే రైల్లోకి ప్రవేశించడానికి ప్రయత్నించినప్పుడు మిగతా వాళ్లు తోసేయడం వల్ల పడిపోతే అది అవాంఛనీయ ఘటన కిందికి ఎలా రాదో అర్థం కావడం లేదని న్యాయమూర్తి తన తీర్పులో వ్యాఖ్యానించారు. 2011 నవంబర్‌లో ఈ ఘటన జరిగింది. తాను ఆ రోజు దాదర్ రైల్వే స్టేషన్‌లో కిక్కిరిసి ఉన్న లోకల్ రైలు ఎక్కగా మిగతా వాళ్లు తోసేయడంతో తాను పడిపోయానని, తలకు, కాలికి గాయాలయ్యాయని హండీవాలా తన పిటిషన్‌లో పేర్కొన్నారు. రైల్వే క్లెయిమ్స్ ట్రిబ్యునల్ ఆయన పిటిషన్‌ను కొట్టివేయగా, ఆయన దాన్ని హైకోర్టులో సవాలు చేశారు.