రైల్వే బోర్డు చైర్మన్ ప్రకటన
న్యూఢిల్లీ: కరోనా వైరస్ సెకండ్ వేవ్ దృష్టా మళ్లీ లాక్‌డౌన్ విధిస్తారన్న భయంతో వలస కార్మికులు తమ స్వస్థలాలకు పెద్ద ఎత్తున తరలివెళుతున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో రైలు సర్వీసులను రద్దు చేసే యోచన ఏదీ లేదని రైల్వే బోర్డు శుక్రవారం ప్రకటించింది. ప్రయాణికుల రద్దీని బట్టి రైలు సర్వీసులను నడుపుతామని కూడా బోర్డు హామీ ఇచ్చింది. రైళ్లకు ఎటువంటి కొరత లేదని, ఎప్పుడు కావాలంటే అప్పుడు రైలు సర్వీసులను ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నామని రైల్వే బోర్డు చైర్మన్ సునీత్ శర్మ విలేకరుల సమావేశంలో స్పష్టం చేశారు.
రైలు సర్వీసులను తగ్గించడం లేదా నిలిపివేయడం వంటి ఆలోచన ఏదీ లేదని ఆయన చెప్పారు. అవసరం మేరకు ఎన్ని రైలు సర్వీసులనైనా నడపడానికి సిద్దంగా ఉన్నామని ఆయన తెలిపారు. రద్దీ ఎక్కువగా ఉంటే వెంటనే రైలు సర్వీసులను నడపడానికి కూడా తాము సిద్ధమని చైర్మన్ ప్రకటించారు. వేసవి కాలంలో ప్రస్తుత రద్దీ సాధారణమేనని, ప్రయాణికుల రద్దీకి తగ్గట్లు రైళ్లను నడపాలని ఇప్పటికే ఆదేశించామని ఆయన చెప్పారు. రైలులో ప్రయాణించడానికి కొవిడ్ నెగటివ్ రిపోర్టు ఉండాల్సిన అవసరం లేదని కూడా ఆయన స్పష్టం చేశారు. కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న దృష్టా రైలు సర్వీసులను తగ్గించాలని లేదా నిలిపివేయాలని కోరుతూ మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి తమకు ఎటువంటి అభ్యర్థన రాలేదని చైర్మన్ చెప్పారు.