న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా స్టేషన్లను అభివృద్ధి చేసేందుకు ఏర్పడిన సంస్థ ‘రైల్వే స్టేషన్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్’(ఐఆర్‌ఎస్‌డిసి)ని మూసేసే ఉత్తర్వులను రైల్వే బోర్డు జారీచేసింది. రెండు నెలల వ్యవధిలో రైల్వే మంత్రిత్వశాఖ కింద మూతపడుతున్న రెండో సంస్థ ఇది. ఇదివరలో ‘ఇండియన్ రైల్వేస్ ఆర్గనైజేషన్ ఫర్ ఆల్లర్నేటివ్ ఫ్యూయల్(ఐఆర్‌ఒఎఎఫ్) సంస్థను 2021 సెప్టెంబర్ 7న మూసేశారు.ఆర్థిక మంత్రిత్వశాఖ సిఫార్సుల మేరకే ఈ చర్య తీసుకున్నారు. ప్రభుత్వ సంస్థలను మూసేయడం లేదా వివిధ మంత్రిత్వ శాఖల కింద ఉన్న సంస్థల్లో విలీనం చేయడం ద్వారా ప్రభుత్వ సంస్థలను హేతుబద్ధీకరణకుగాను ఆర్థిక మంత్రిత్వ శాఖ చేసిన సిఫార్సు మేరకు ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది. ఐఆర్‌ఎస్‌డిసిని మూసేసే ఉత్తర్వులను రైల్వే బోర్డు సోమవారం జారీచేసింది. ఐఆర్‌ఎస్‌డిసి కింద నిర్వహిస్తున్న సేష్టన్లను ఆయా జోనల్ రైల్వేస్‌కు అప్పగిస్తారు.
ఐఆర్‌ఎస్‌డిసిని 2012 మార్చిలో ఏర్పాటుచేశారు. ముంబయిలో ఛత్రపతి శివాజీ టెర్మినస్‌ను అభివృద్ధి చేసింది కూడా ఐఆర్‌ఎస్‌డిసి. ఇదిలా ఉండగా రిపోర్టును తయారుచేసిన ముఖ్య ఆర్థిక సలహాదారు సంజీవ్ సన్యాల్ ఇంకా రైల్ వికాస్ నిగం లిమిటెడ్(ఆర్‌విఎన్‌ఎల్)ను ఇండియన్ రైల్వే కన్‌స్ట్రక్షన్ లిమిటెడ్(ఐఆర్‌సిఒఎన్)లో విలీనం చేసే సిఫార్సు చేశారు. రైల్వే మౌలిక వసతులను సృష్టించడం, వేగవంతం చేయడానికే ఐఆర్‌విఎన్ ఏర్పడింది.