న్యూఢిల్లీ : రైల్వే స్టేషన్లు, ఆవరణలలో మాస్క్‌లు తప్పనిసరిగా ధరించాలి. లేకపోతే రైల్వే చట్టం పరిధిలో శిక్షార్హమైన నేరంగా పరిగణించి రూ 500 వరకూ జరిమానా విధిస్తారు. ఈ మేరకు శనివారం రైల్వే విభాగం శనివారం అధికారిక ఉత్తర్వులు వెలువరించింది. దేశవ్యాప్తంగా కరోనా ఉధృతి సాగుతోంది. వలసకూలీలు దూర ప్రాంతాల్లోని తమ స్వస్థలాలకు రైళ్ల ద్వారా తిరుగు ప్రయాణం అవుతున్నారు. ఈ దశలో కరోనా కట్టడిలో భాగంగా ఈ మాస్క్ ధారణ నిబంధనను తీసుకువచ్చారు. కొవిడ్ నియంత్రణకు కేంద్ర ఆరోగ్య కుటుంబ వ్యవహారాల మంత్రిత్వశాఖ వివిధ రకాల ప్రోటోకాల్స్‌ను వెలువరించింది. వీటికి అనుగుణంగా రైల్వేవిభాగం ఇటీవలి కాలంలో పలు వరుస చర్యలు చేపట్టింది. మాస్క్‌లు వేసుకోకపోతే రూ 500 జరిమానా అనేది ఇందులో తాజా నిబంధన అయింది.
అన్నింటికంటే ముఖ్యంగా ఈ మాస్క్‌లు వేసుకోవడం నిర్ధేశిత నిబంధనగా రూపొందించినట్లు, కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. గత ఏడాది మే నెలలోనే కరోనా వైరస్ నియంత్రణకు భారతీయ రైల్వే విభాగం ప్రయాణికులకు సంబంధించి ప్రామాణిక నిర్వాహక నియమావళిని (ఎస్‌ఒపి)ని తీసుకువచ్చింది. దీని మేరకు ప్రయాణాల సమయాలలో ప్రయాణికులంతా విధిగా మాస్క్ ధరించాలని సలహా వెలువరించింది. అదే విధంగా రైల్వే ఆవరణలలో ఉమ్మివేయడం వంటి చర్యలకు తగు ఫైన్ వేయాల్సి ఉంటుందని తెలిపింది. ఇప్పుడు వెలువరించిన ఉత్తర్వుల మేరకు ప్రయాణికులు అనివార్యంగా మాస్క్‌లు పెట్టుకోవల్సిందే. లేకపోతే రూ 500 జరిమానాకు గురికావల్సిందే. మాస్క్ లేకపోతే జరిమానా నిర్ణయం వచ్చే ఆరు నెలల వరకూ అమలులో ఉంటుంది.