రైల్వేలను ఎన్నటికీ ప్రైవేటీకరించం
అయితే మెరుగైన పనితీరు కోసం ప్రైవేటు పెట్టుబడులను స్వాగతిస్తాం
లోక్‌సభలో రైల్వేమంత్రి పీయూష్ గోయల్ వెల్లడి
న్యూఢిల్లీ: రైల్వేలను ఎన్నటికీ ప్రైవేటీకరించబోమని, అయితే మరింత మెరుగైన పని తీరుకోసం ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహిస్తామని రైల్వే మంత్రి పీయూష్ గోయల్ మంగళవారం లోక్‌సభలో స్పష్టం చేశారు. పార్లమెంటులో రెండో విడత బడ్జెట్ సమావేశాల్లో భాగంగా మంగళవారం లోక్‌సభలో రైల్వేలకు నిధుల కేటాయింపులపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా గోయల్ మాట్లాడుతూ.. ప్రభుత్వ, ప్రైవేటు రంగాలు కలిసి పని చేస్తే పెద్ద ఎత్తున ఉద్యోగావకాశాలను కల్పించవచ్చన్నారు. అప్పుడే దేశం కూడా అభివృద్ధి పథంలో పయనించగలుగుతుందన్నారు. ‘రైల్వేలను ఎన్నటికీ ప్రైవేటీకరించబోం. ఇది ప్రతి భారతీయుడి ఆస్తి. ఎప్పటికీ కేంద్ర ప్రభుత్వ అధీనంలోనే ఉంటుంది.అయితే రైల్వేలలో పనితీరును మెరుగుపర్చడంకోసం ప్రైవేటు పెట్టుబడులను మేము స్వాగతిస్తాం’ అని మంత్రి స్పష్టం చేశారు. ఇక 2021 22ఆర్థిక సంవత్సరానికి గాను రైల్వే కేటాయింపులను ప్రభుత్వం భారీగా పెంచిందని గోయల్ తెలిపారు.2019 20ఆర్థిక సంవత్సరంలో ఈ పెట్టుబడులు రూ.1.5 లక్షల కోట్లు ఉండగా ప్రస్తుత బడ్జెట్‌లో ఈ పెట్టుబడులను రూ.2.15 లక్షల కోట్లకు పెంచడం జరిగిందన్నారు.
రైల్వే ప్రాజెక్టులను సత్వరం అమలు చేయడానికి భూసేకరణకు రాష్ట్రప్రభుత్వాల సహకారాన్ని ఆయన కోరారు. ‘మహారాష్ట్ర ప్రభుత్వం గనుక మద్దతు అందించి బంద్రా కుర్లాలో రైల్వే టెర్మినల్ కోసం భూమిని అందిస్తే జపాన్ టెక్నాలజీని ఉపయోగించి హైస్పీడ్ బులెట్ ట్రైన్ భారత్‌కు వస్తుంది. గుజరాత్, దామన్, డయ్యులో 95 శాతం భూమిని సేకరించడం జరిగింది. అయితే మహారాష్ట్రలో 24 శాతం భూమినే సేకరించాం. మహారాష్ట్రలో భూమిని సేకరించగలిగితే ఈ ప్రాజెక్టును మరింత వేగంగా అమలు చేయడానికి వీలవుతుంది’ అని పీయూష్ గోయల్ చెప్పారు.2023 డిసెంబర్ నాటికి భారతీయ రైల్వేల విద్యుదీకరణను పూర్తి చేయాలని ప్రభుత్వం లక్షంగా పెట్టుకుందని చెప్పారు. రెండేళ్లుగా రైల్వేలో ప్రమాదం కారణంగా ఒక్కరు కూడా చనిపోలేదని మంత్రి తెలిపారు. ప్రయాణికుల భద్రత, పెట్టుబడులకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని గోయల్ తెలిపారు. అనంతరం లోక్‌సభ రైల్వే పద్దులకు ఆమోదం తెలిపింది.
Railways will ever privatised says Piyush Goyal