దిశ మార్చుకున్న ‘జవాద్’ తుపాను
తీవ్ర వాయుగుండంగా బలహీన పడి నేడు పూరీ సమీపంలో తీరాన్ని తాకే అవకాశం
ఒడిశా తీరప్రాంతంలో పాటు ఉత్తరాంధ్రలో విస్తారంగా వర్షాలు పడే అవకాశం: ఐఎండి
న్యూఢిల్లీ: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో విశాఖకు ఆగ్నేయంగా 200 కిలోమీటర్లు, గోపాల్‌పూర్‌కు 310 కిలోమీటర్ల దూరంలో జవాద్ తుపాను కేంద్రీకృతమై ఉందని భారత వాతావరణ శాఖ శనివారం తెలియజేసింది. శనివారం ఉదయం 5.30 గంటలకు అది పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో విశాఖకు ఆగ్నేయంగా 230 కి.మీ, ఒడిశాలోని పూరీ పట్టణానికి 410 కి.మీ దక్షిణ, ఆగ్నేయంగా కేంద్రీకృతమై ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర కోస్తాంధ్ర తీరానికి దగ్గరగా వచ్చిన తర్వాత దిశ మార్చుకున్న తుపాను ప్రస్తుతం మందగమనంతో ఒడిశా వైపు కదులుతున్నట్లు తెలిపింది. గత ఆరు గంటలుగా ఇది గంటకు 3 కిలోమీటర్ల వేగంతో కదులుతున్నట్లు తెలిపింది. కొద్ది గంటల్లోనే ఇది తీవ్ర వాయుగుండంగా బలహీన పడే సూచనలున్నట్లు ఐఎండి తెలిపింది. ఇదే వేగంతో కదులుతూ ఆదివారం మధ్యాహ్నానికి ఒడిశాలోని పూరీ తీరానికి వెళ్లే అవకాశముందని తెలిపింది. తదుపరి మరింత బలహీనపడి పశ్చిమ బెంగాల్ దిశగా కదిలే సూచనలున్నాయని తెలిపింది. తుపాను ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్రలో గంటకు 65నుంచి 70 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. రాగల 24 గంటల్లో ఈ జిల్లాలతో పాటు ఒడిశా తీరప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.
Rain Alert to AP for next 24 hours