Friday, November 22, 2024

ఉత్తరాదిన కొనసాగుతున్న వర్ష విలయం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఉత్తరాది రాష్ట్రాల్లో వరుణుడు బీభత్సం సృష్టిస్తున్నాడు. గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వానలకు దేశ రాజధాని ఢిల్లీ సహా రాజస్థాన్, పంజాబ్ , హర్యానా, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు విలవిలలాడుతున్నాయి. నదులు, వాగులు అన్నీ పొంగి ప్రవహిస్తూ ఉండడంతో గ్రామాలు, పట్టణాలు, పంటపొలాలు అన్నీ నీటమునిగి జన జీవనం స్తంభించి పోయింది. కొండచరియలు విరిగిపోయి, రోడ్లు తెగిపోయి రాకపోకలు స్తంభించాయి. సోమవారం వరకు ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాల కారణంగా 37 మంది మృతి చెందగా, తాజాగా మరో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు.

వీరిలో నలుగురు ఉత్తరాఖండ్‌లో చనిపోగా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్‌లలో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. ఓ వైపు కుండపోత వర్షాలు కురుస్తుండడం, నదులన్నీ పొంగి ప్రవహిస్తూ ఉండడంతో రాష్ట్రప్రభుత్వాలు సహాయక చర్యలను వేగవంతం చేశాయి. ముఖ్యంగా హిమాచల్‌ప్రదేశ్ భారీ వర్షాలకు అతలాకుతలమైంది. ఒక్క ఈ రాష్ట్రంలోనే వర్షాల కారణంగా 30 మంది చనిపోయారు. వీరిలో 11 మంది రాష్ట్ర రాజధాని సిమ్లాకు చెందిన వారే కావడం గమనార్హం. మరో వైపు భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలో సంభవించిన వరదలకు సుమారు రూ.3,000 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.

వర్షాల కారణంగా రాష్ట్రంలో పలు చోట్ల కొండచరియలు విరిగిపడుతున్నాయి. దీంతో చందర్‌తాల్, పాల్ నల్లా, లాహోల్,స్పితి సహా పలు ప్రాంతాల్లో 500 మందికి పైగా పర్యాటకులు చిక్కుపడిపోయారు. ఇక ఉనా జిల్లాలోని మురికివాడను వరదలు ముంచెత్తాయి. అంపలో చిక్కుకు పోయిన 500 మందికి పైగా కార్మికులను ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలు సురక్షితంగా కాపాడాయి. మరో వైపు రాష్ట్రంలో తాజా పరిస్థితుల దృష్టా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి సుఖ్విదర్ సింగ్ సుఖ్ సూచించారు.

వరద ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్, నీటి సరఫరా పునరుద్ధరణకోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. ఆయన మంగళవారం కులు, లాహోల్, స్పితి, మండి ప్రాంతాలను సందర్శించే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. ఉత్తరాఖండ్‌లో సోమవారం రాత్రి కొండచరియలు విరిగి మూడు వాహనాలు వాటి కింద చిక్కుకు పోవడంతో మధ్యప్రదేశ్‌కు చెందిన నలుగురు మృతి చెందగా ఏడుగురు గాయపడినట్లు అధికారులు తెలిపారు.

ఉత్తరకాశీ జిల్లా లోని గంగోత్రి జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. హర్యానాలోని అంబాలా సిటీలో ఘాగ్రా నది కరకట్ట సోమవారం రాత్రి తెగిపోయి వరద నీరు ఓ రెసిడెన్షియల్ పాఠశాలలోకి ప్రవేశించడంతో అందులోని 730 మంది విద్యార్థులను కురుక్షేత్రకు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News