ముంబై: మహారాష్ట్రలో ఎడతెరిపిలేని భారీ వర్షాలు కురుస్తుండడంతో అనేక ప్రాంతాలు నీటిలో మునిగి తేలుతున్నాయి. గురువారం భారీ వర్షాలకు వివిధ సంఘటనలకు సంబంధించి మొత్తం ఆరుగురు బలయ్యారు. పుణెలో మొత్తం నలుగురు చనిపోగా వీరిలో ముగ్గురు కరెంట్‌షాక్‌కు బలయ్యారు. థానే బర్విడామ్‌లో వరద నీటిలో ఇద్దరు మునిగి మృతి చెందారు. భారీ వర్షపాతంతో ముంబై, పాల్ఘర్‌లకు రెడ్ అలెర్ట్ జారీ చేశారు. శుక్రవారం ఉదయం 8.30 గంటల వరకు ముంబైలో వాతావరణ విభాగం రెడ్ అలర్ట్ జారీ చేసింది.
ముంబై శాంతాక్రూజ్ లోని అబ్జర్వేటరీ ఈ నెలలో ఇంతవరకు 1500 మిమీ వర్షపాతాన్ని నమోదు చేసి, ముంబై నగర చరిత్రలో రెండో భారీ వర్ష జులై నెలగా రికార్డుకెక్కింది. గత ఏడాది ముంబైలో జులై లోనే 1771 మిమీ వర్షపాతం నమోదు కావడం గమనార్హం. రాష్ట్రం లోని కుండాలిక, అంబ నదులతోపాటు మొత్తం నాలుగు నదులు ప్రమాదస్థాయి మించి వరద నీటితో ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. నదీతీర ప్రాంతంలో ఉన్న గ్రామాలకు , ఇతర నివాసాలకు ముంపు ముప్పు పొంచి ఉండడంతో లోతట్టు ప్రజలను వేరే చోటికి తరలిస్తున్నారు. ముంబై ఛత్రపతి శివాజీ విమానాశ్రయానికి ఆనుకుని ఉన్న మిథి నది ప్రమాదస్థాయికి కేవలం ఒక మీటరు దిగువన ప్రవహిస్తోంది. వర్షాల కారణంగానే విమాన సర్వీసులకు ఆటంకాలు ఏర్పడ్డాయి.
విమానాల రాకపోకల్లో ఆలస్యం జరుగుతోందని ఇండిగో, స్పైస్‌జెట్ సంస్థలు ప్రయాణికులను హెచ్చరించాయి. విమాన సర్వీస్‌లు రద్దు కావడంతో ప్రయాణికులకు ఎయిర్ ఇండియా రిఫండ్ చేస్తోంది. ముంబై నగరంలా పుణె కూడా భారీ వర్షాలతో సతమతమవుతోంది. శుక్రవారం ఉదయం వరకు రెడ్ అలర్ట్ జారీ అయింది. ఏక్తానగ్రి, విఠల్ నగర్, కల్యాణినగర్ లోని హౌసింగ్ సొసైటీలు భారీ వరద నీటితో అల్లాడుతున్నాయి. డైజాస్టర్ రెస్పాన్స్ టీమ్‌లను అవసరమైతే సహాయం అందించడానికి సిద్ధం చేశారు. స్కూళ్లు, కాలేజీలు మూత పడ్డాయి. పింప్రి చించివాడ లోని మోర్య గోసవి గణపతి ఆలయం పూర్తిగా వరద నీటిలో మునిగిపోయింది. డిప్యూటీ సిఎం అజిత్ పవార్ వరద బాధిత ప్రాంతాలను సందర్శించారు. సహాయ కార్యక్రమాలను ఎప్పటికప్పుడు సమీక్షించాలని పోలీస్ అధికారులకు సూచించారు.
పుణెకు 65 కిమీ దూరంలో లావాసాలో కొండచరియలు విరిగి పడి రోడ్డు పూర్తిగా కొట్టుకుపోయింది. రాయ్‌గఢ్ జిల్లాలో మహద్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ ఏరియాలో చిన్న వాగుపై ఉన్న వంతెన కొట్టుకుపోయింది. సతారా జిల్లా లోని కొయనా డ్యామ్ ఆరు గేట్లు కొంత తెరవడంతో 11,000 క్యూసెక్కుల నీరు బయటకు పెల్లుబికి ప్రవహించింది. డ్యామ్‌లోని నీటి మట్టాన్ని నియంత్రించడానికి సాయంత్రం ఏడు గంటల సమయంలో మళ్లీ గేట్లు తెరిచారు. ముంబైకి 60 కిమీ దూరంలో ఉన్న బాదల్‌పూర్‌లో వరద ముప్పు పొంచి ఉంది. దీనికి ఉల్హాస్ నది ప్రమాదస్థాయిని మించి ప్రవహించడమే కారణం. బాదల్‌పూర్ నగరంలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.అక్కడి ప్రజలను వేరే చోటికి తరలించారు.