Sunday, December 22, 2024

రాష్ట్రమంతటా భారీ వర్షాలు.. మరో నాలుగు రోజులు..

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : ఉపరితల ఆవర్తనాలు అల్పపీడన ప్రభావంతో రాష్ట్రమంతటా ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. శనివారం పలు ప్రాంతాల్లో వడగళ్ల వానలు పడ్డాయి. దక్షిణ తమిళనాడు నుంచి ఉత్తర కొంకణ్ వరకు ఉన్న ద్రోణి తమిళనాడు నుంచి రాయలసీమ , తెలంగాణ , విదర్భ మీదుగా సముద్ర మట్టానికి 0.9కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతున్నదని , దీని ప్రభావంతో మరో నాలుగు రోజులపాటు రాష్ట్రానికి వర్షసూచన ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆదివారం కూడా పలు జిల్లాల్లో ఉరుములు , మెరుపులు , ఈదురుగాలులతో కూడి వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో తెలంగాణ రాష్ట్రమంతటికీ ఎల్లో అలర్ట్ ప్రకటించింది.

రాష్ట్రంలోని జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం , నల్లగొండ, సూర్యాపేట, వరంగల్ ,జనగామ, యాదాద్రి భువనగిరి , వికారాబాద్ , నాగర్‌కర్నూల్ ,హైదరాబాద్, నారాయణపేట్, గద్వాల, నాగర్ కర్నూలు , తదితర జిల్లాల్లో ఉరుములు , మెరుపులతోపాటు గంటకు 40నుంచి 50కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. రానున్న 48గంటల్లో ఆకాశం మేఘావృతమై, వాతావరణం ముసురుపట్టి ఉంటుంది. గంటకు 50కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతోపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మరో మూడు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపింది.

రాష్ట్రంలో 31.7మి.మి వర్షపాతం

గడిచిన 24గంటల్లో రాష్ట్రంలో సగటున 31.7మి.మి వర్షపాతం నమోదైనట్టు వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా భద్రాచలంలో 32.8మి.మి , దుండిగల్‌లో 5.8, హకీంపేటలో 34.6, హనుమకొండలో 4, హైదరాబాద్‌లో 31.7, ఖమ్మంలో 17.6, మహబూబ్‌నగర్‌లో 5.6, మెదక్‌లో 6, నిజామాబాద్‌లో 1.8, పటాన్‌చెరులో 15.4, రాజేంద్రనగర్‌లో 35.0, మిల్లిమీటర్ల చొప్పున వర్షం కురిసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News