నగరంలో ట్రాఫిక్ జాం
లోతట్టు ప్రాంతాలు జలమయం
మేడ్చల్ మల్కాజిగిరిలో 68.8,
రంగారెడ్డిలో 66.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు
హైదరాబాద్: రాష్ట్రంలోని పలు జిల్లాలతో పాటు హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం దంచికొట్టింది. నగరంలోని ఎల్బీనగర్, మన్సూరాబాద్, నాగోల్, వనస్థలిపురం, సికింద్రాబాద్‌లో వర్షం కురిసింది. ఒక్కసారిగా వరుణుడు రావడంతో భారీగా ట్రాఫిక్ జాం కావడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఉపరితల ఆవర్తన ప్రభావంతో నగరంలోని పలు ప్రాంతాల్లో వాన దంచికొట్టడంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. బోయిన్‌పల్లి, మారేడ్‌పల్లి, తిరుమలగిరి, అల్వాల్, ప్యాట్నీ, బేగంపేట్, చిలకలగూడ, కూకట్‌పల్లి, ఆల్వీన్‌కాలనీ, హైదర్‌నగర్, నిజాంపేట్, మూసాపేట్ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. మేడ్చల్ మల్కాజిగిరిలో 68.8 మిల్లీమీటర్లు, రంగారెడ్డిలో 66.8, హైదరాబాద్‌లో 64.5 మిల్లీమీటర్ల వర్షపాతం మంగళవారం కురిసింది.
రాబోయే రెండు రోజులు భారీ వర్షాలు
రాష్ట్రంలో నేడు అక్కడక్కడ ఉరుములు,మెరుపులతో కూడిన భారీ, ఎల్లుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఎల్లుండి నుంచి మూడు రోజుల పాటు గంటకు 40 నుంచి 50 కి మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ కేంద్రం సంచాలకులు వెల్లడించారు. నేడు తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని, ఈ ఆవర్తన ప్రభావంతో తదుపరి 48గంటల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాని సంచాలకులు వివరించారు.