రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణంలో మార్పులు
పలుచోట్ల చల్లబడిన వాతావరణం
మనతెలంగాణ/హైదరాబాద్: ఉదయం నుంచి ఎండ దంచికొట్టగా మధ్నాహానికి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో మధ్యాహ్నం చిరుజల్లులు కురవడంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కూడా కురిసిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఆదివారం ఉత్తర కేరళ నుంచి ఇంటీరియర్ కర్ణాటక, మరతాడ్వాల మీదుగా నైరుతి మధ్యప్రదేశ్ వరకు ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో పలు చోట్ల వానలు కురుస్తున్నాయని అధికారులు తెలిపారు.
సోమవారం ఇంటీరియర్ ఒడిస్సా దాని పరిసర ప్రాంతాల్లో సముద్రమట్టం నుంచి 1.5 కి.మీల మేర ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతోపాటు దక్షిణ తమిళనాడు నుంచి ఇంటీరియర్ కర్ణాటక మీదుగా దక్షిణ కొంకణ్ వరకు ఉపరితల ద్రోణి ఏర్పడిందని ఈ నేపథ్యంలో పలు ప్రాంతాల్లో వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయని అధికారులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా నేడు, రేపు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఎల్లుండి ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలులతో కూడిన తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని, పలుచోట్ల 30 నుంచి 40 కి.మీల వేగంతో గాలులు వీచే అవకాశం కూడా ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వికారాబాద్, హైదరాబాద్, ఆదిలాబాద్‌తో పాటు పలు జిల్లాలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయని వాతావరణ శాఖ తెలిపింది.