Monday, November 18, 2024

చినుకు…వణుకు

- Advertisement -
- Advertisement -

మరో మూడు రోజులు అతిభారీ వర్షాలు
తెలంగాణకు రెడ్ అలర్ట్ జారీ
వేల్పూరులో రికార్డు స్థాయి 46 సెంటీమీటర్ల వర్షం

హైదరాబాద్ : వర్షభీభత్సం ప్రజలకు వణుకు పుట్టిస్తోంది. విడవ కుండా కురుస్తున్న కుండపోత వర్షాలతో రాష్ట్ర మంతటా జనజీవనం అస్తవ్యస్థంగా మారింది. భారీ వర్షాల ప్రభావంతో ఎక్కడికక్కడ వాగులు వంకలు ఏకమై ప్రవహిస్తున్నాయి. వరంగల్ ,ఖమ్మం జిల్లాల్లో మున్నేరు, ఆకేరు , పాలేరు నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పలు జిల్లాల్లో లోకల్ వాగులు కాజ్‌వేలను ఎక్కి ప్రవహిస్తుండటంతో ఆయా మార్గాల్లో రాకపోకలు నిలిచిపోయాయు. వర్షాల కారణంగా వ్యవసాయ పనులు కూడా అనుకున్నంతగా ముందుకు సాగటం లేదు. ఖరీఫ్‌లో ఈ సమయానికి వ్యవసాయ పనులు మంచి ఊపుమీద సాగాల్సివుండేది. పనుల కోసం రైతులు కూలీల చుట్టు తిరిగే పరిస్థితి నుంచి ఎడతెరిపిలేని వర్షాలతో వ్యవసాయ పనులు ముందుకు సాగక అరకోర పనులతో గ్రామాల్లో వ్యవసాయ కూలీలు బిక్కుబిక్కుమంటున్నారు. భారీ వర్షాల ధాటికి రాష్ట్రంలోని పలు పట్టణాలు , నగరాల్లో లోతట్టు ప్రాంతాల్లో కి వర్షపు నీరు చేరి శివారు కాలనీలు గంటల తరబడి వర్షపు నీటిలోనేమగ్గాల్సి వస్తోంది. హైదరాబాద్ ,వరంగల్ వంటి నగరాల్లో సైతం పలు కాలనీల్లోకి వర్షపు నీరు ప్రవేశిస్తోంది.

నిమిషాల వ్యవధిలో కురుస్తున్న భారీ నుంచి అతి భారీ వర్షాల ధాటికి నగరాల్లో వర్షపు నీరు రొడ్లను కాలువలుగా మార్చివేస్తోంది. గంటల తరబడి ట్రాఫిక్ జామ్ గత నాలుగైదు రోజులుగా నిత్యకృత్యంగా మారింది. మరో వైపు రాష్ట్రంలోని ఉత్తర తెలంగాణ ప్రాంతంలో స్థానికంగా కురుస్తున్న వర్షాల కారణంగా లోకల వాగులు వరదనీటితో పోటెత్తుతున్నాయి. రోడ్లు కోసుకుపోయి , వంతెనలు వరదనీట మునిగి ఎక్కడ ఏ మార్గంలో రాకపోకలు నిలిచి పోతాయో అని ఆయా మార్గాల్లో ప్రయాణించే వాహనదారులు భయం భయంగానే సాగుతున్నారు. వేర్వేరు సంఘటనల్లో వాగుల్లో ముగ్గురు వ్యక్తులు గల్లంతయ్యారు. వాగులో కొట్టుకుపోతున్న మరో వ్యక్తిని పోలీసులు రక్షించారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం కొండేడు గ్రామ సమీపాన కూలీ పనులకోసం వెళ్లి వాగు దాటుతుండగా స్వాతి, అనూష అనే మహిళలు నీటి ఉదృతిలో కొట్టుకుపోయారు . తోటికూలీలు ఇది గమనించి మరికొందరి సాయంతో వాగులో గాలించి అప్పటికే మృతి చెందివున్న ఇరువురి మృతేదేహాలను బయటకు తీశారు. రంగారెడ్డి జిల్లా ఫరూఖ్ నగర్ మండల పరిధిలోని అయ్యవారి వాగులో ఒక మహిళ గల్లంతైంది. బంధువుల ఇంటికి వచ్చిన గుమ్మడి నిర్మల వాగులో వరదనీటి ఉధృతికి కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయినట్టు సమాచారం. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మూలవాగులో వదర ఉధృతికి శెట్టిపల్లి మారుతి అనే వ్యక్తి కొట్టుకుపోతుండగా పోలీసులు అతడిని కాపాడారు.
మరో మూడు రోజులు అతిభారీ వర్షం: రెడ్‌అలర్ట్ జారీ
రాగల మూడు రోజుల్లో తెలంగాణవ్యాప్తంగా భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది. రానున్న 24గంటల్లో అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. మరో మూడురోజులు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడిస్తూ రెడ్ అలెర్ట్ జారీ చేసింది. బుధవారం నుంచి గురువారం ఉదయం వరకు కరీంనగర్, పెద్దపల్లి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, వికారాబాద్‌లో అతిభారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని పేర్కొంది. ఈమేరకు ఆ జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది. మంచిర్యాల, నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, భువనగిరి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే సూచనలున్నాయని తెలిపింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. వాతావరణశాఖ పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. బుధవారం నుంచి గురువారం వరకు ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, జనగాం, సిద్దిపేట, భువనగిరిలో అతిభారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని పేర్కొంది.గురువారం నుంచి శుక్రవారం ఉదయం వరకు నిజామాబాద్, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వెల్లడిస్తూ ఈ జిల్లాలకు రెడ్ అలెర్ట్‌ను జారీ చేసింది. మిగతా జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది
నిజామాబాద్‌లో భారీ వర్షం.. వేల్పూరులో 46.3 సెం.మీ.
గడిచిన 24గంటల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షం కురిసింది. నిజామాబాద్ జిల్లాలోని పలు చోట్లు రికార్డు స్థాయి వర్షం పడింది.వేల్పూరులో 46.3 సెంటీమీటర్ల వర్షం కురిసింది. జక్రాన్‌పల్లిలో 23.6 సెం.మి,భీమ్‌గల్‌లో 23.4 సెం.మీ వర్షం కురిసింది. వరంగల్ జిల్లా సంగెంలో 21.84, నల్లబెల్లిలో 17.22 సెం.మీ వర్షం కురిసింది. ఆత్మకూరులో 14.4, జాఫర్‌గడ్‌ల 16.2, రేగొండలో 14.4, శాయంపేటలో 14.3, పరకాలలో 14.2, ఘన్‌పూర్‌లో 14.2, మోర్టాడ్‌లో 13.9, ఆర్మూర్‌లో 13.6, పర్వతగిరిలో 13.2, ములుగులో 12.7, బోన్‌కల్‌లో 12.2, పాలకుర్తిలో 12.2, డోర్నకల్‌లో 11.9, చెన్నరావుపేటలో 11.3, శ్రీరాంపూర్‌లో 11.2, కూసుమంచిలో 11.2, మహబూబాబాద్‌లో 10.8,ఖానాపూర్‌లో 10.5 సెంటీమీర్ల వర్షం కురిసింది.రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాలో కూడా ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News