హైదరాబాద్ వాతావరణ కేంద్రం
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా నేడు, రేపు, ఎల్లుండి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాగల మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. గురువారం ఉత్తర తమిళనాడు దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం శుక్రవారానికి బలహీనపడి ఉత్తర అంతర్గత తమిళనాడు పరిసర ప్రాంతాల్లో అల్పపీడనంగా కొనసాగుతోందని హైదరాబాద్ వాతావరణ శాఖ సంచాలకురాలు డాక్టర్ నాగరత్న తెలిపారు. అల్పపీడన అనుబంధ ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి సుమారు 5.8 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోందని డాక్టర్ నాగరత్న వెల్లడించారు. ఈ ఉపరితల ఆవర్తనం నుంచి ఒక ఉపరితల ద్రోణి కోస్తాంధ్రప్రదేశ్ మీదుగా ఉత్తర ఒడిశా కోస్తా వరకు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడిందని ఆమె పేర్కొన్నారు. నేడు దక్షిణ అండమాన్ పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఈ నెల 15న తూర్పు మధ్య పరిసర బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలోకి ఈశాన్య దిక్కుల నుంచి గాలులు వీస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.