Saturday, November 23, 2024

జోష్ తగ్గని రైనా..

- Advertisement -
- Advertisement -

Raina batted exceptionally well

ముంబై: ఐపిఎల్‌లో అత్యంత నిలకడైన ప్రదర్శనే చేసే బ్యాట్స్‌మన్‌లలో సురేశ్ రైనా ఒకడు. ప్రతి సీజన్‌లోనూ నిలకడగా ఆడిన తన జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించడం సురేశ్ రైనా అలవాటుగా మార్చుకున్నాడు. కిందటి సీజన్‌లో రైనా వ్యక్తిగత కారణాలతో ఐపిఎల్‌కు దూరంగా ఉన్నాడు. దీంతో రైనా ఇకపై ఐపిఎల్‌లో ఆడడం కష్టమేనని వార్తలు వచ్చాయి. కానీ ఆ వార్తలను పటాపంచలు చేస్తూ ఈ సీజన్‌లో రైనా మళ్లీ సిఎస్‌కె తరఫున బరిలోకి దిగాడు. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకడంతో రైనా ఐపిఎల్‌లో రాణించడం కష్టమేనని అందరూ భావించారు. అంతేగాక వయసు సమస్య కూడా వెంటాడుతుండడంతో ఈసారి రైనా ఒకప్పటిలా జోరుగా ఆడడం కుదరదేమోనని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. కానీ రైనా మాత్రం తనలో చేవ, జోస్ తగ్గలేదని తొలి మ్యాచ్‌లోనే నిరూపించాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన ఆరంభ మ్యాచ్‌లో రైనా అసాధారణ బ్యాటింగ్‌ను కనబరిచాడు. ఏడు పరుగులకే రెండు వికెట్లు పడిపోయిన దశలో బ్యాటింగ్‌కు దిగిన రైనా అద్భుతంగా ఆడాడు.

మొయిన్ అలీతో కలిసి అతను స్కోరును ముందుకు నడిపించిన తీరును ఎంత పొగిడినా తక్కువే. కళ్లు చెదిరే షాట్లతో రైనా అలరించాడు. జట్టు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెడుతూ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఢిల్లీ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ స్కోరును ముందుకు నడిపించిన తీరు చూడముచ్చటగా ఉంది. తనలో ఇంకా క్రికెట్ మిగిలేవుందనే ఈ ఇన్నింగ్స్ ద్వారా రైనా మరోసారి నిరూపించాడు. ప్రత్యర్థి బౌలర్లపై ఎదురుదాడికి దిగిన రైనా 36 బంతుల్లోనే 54 పరుగులు చేయడం విశేషం. ఈ క్రమంలో రైనా ఏకంగా నాలుగు భారీ సిక్సర్లు కూడా బాదేశాడు.

అంతేగాక మూడు కళ్లు చెదిరే బౌండరీలు కూడా కొట్టాడు. రైనా బ్యాటింగ్‌ను చూసిన ప్రతి ఒక్కరూ అతనిపై ప్రశంసల వర్షం కురిపించారు. తీవ్ర ఒత్తిడిలో ఈసారి ఐపిఎల్ బరిలోకి దిగిన రైనా ఆడిన తొలి మ్యాచ్‌లోనే అద్భుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. రానున్న మ్యాచుల్లో మరింత నిలకడగా ఆడేందుకు ఇది దోహదం చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక చెన్నై జట్టులో తానెంత కీలక ఆటగాడినో రైనా ఈ ఇన్నింగ్స్ ద్వారా మరోసారి చాటి చెప్పాడు. ప్రత్యర్థి బౌలర్లు చెలరేగి బౌలింగ్ చేస్తున్నా ఏమాత్రం ఒత్తిడికి గురికాకుండా రైనా ఆడిన ఇన్నింగ్స్ ఈ సీజన్‌లో ప్రత్యేక ఇన్నింగ్స్‌లలో ఒకటిగా నిలిచి పోతుందని చెప్పక తప్పదు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News