ఎండలతో మండిపోతున్న తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి కబురందించింది. రాష్ట్రంలో రాగల రెండురోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఆది ,సోమ వారాల్లో వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటాయని తెలిపింది. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని, ,గంటకు 40నుండి 50కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. యాసంగిలో సాగు చేసిన పంటలు కోత దశలో ఉన్నాయి. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో వరికోత పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో వాతావరణంలో వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు గమనించాలని వాతవరణ కేంద్రం సూచించింది. రాగల రెండు రోజులు పలు జిల్లాల్లో వర్షాలు ..ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున వరికోత పనులు కొనసాగించటంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని , ధాన్యం తడిసిపోకుండా అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.మరోవైపు రాగల 24గంటల్లో రాష్ట్రంలోని నిజామాబాద్, ఖమ్మం, మెదక్, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వడగాలులు కురుస్తాయని వెల్లడించింది.
ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, మెదక్, జగితాల్య, రాజన్న సిరిసిల్ల, కీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో రాత్రిళ్లు వేడిగా ఉండే అవకాశం ఉంటుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆదివారం ఖమ్మం, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వడగాలులు వీస్తాయని తెలిపింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, కరీంనగర్, పెద్దపల్లి, సిద్దిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల్లో అక్కడక్కడ వేడి, తేమతో కూడిన పరిస్థితులుంటాయని తెలిపింది. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో రాత్రిపూట వేడిగా ఉంటుందని పేర్కొంది. ఈ మేరకు ఆయా జిల్లాల్లకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. సోమవారం పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.
భగ్గుమన్న కొత్తగూడెం..44.5డిగ్రీలు
రాష్ట్రంలో శనివారం నాగు పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి. భద్రాద్ది కొత్తగూడెం జిల్లా భగ్గుమంది.ఈ జిల్లాలోని గరిమెళ్లపాడులో 44.5డిగ్రీలు ,అశ్వారావుపేట, మల్కాపురం కేంద్రాల్లో 44.4డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సూర్యాపేట జిల్లా పెన్‌పహడ్‌లో 44.5 డిగ్రీలు , నల్లగొండ జిల్లా నాంపల్లిలో 44.5డిగ్రీలు, తడ్కల్‌లో 44.3డిగ్రీలు నమోదయ్యాయి. కొమరంభీం జిల్లా ఎల్కపల్లి, ములుగు జిల్లా మేడారం కేంద్రాల్లో 44.4డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మంచిర్యాల జిల్లా హాజిపుర, మహబూబాబాద్ జిల్లా మరిపెడ కేంద్రాల్లో 44.4డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోయ్యాయి.