Sunday, December 22, 2024

ముసురుకుంది

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కు రుస్తున్నాయి. కుండపోత వర్షంతో హైదరాబాద్ నగరం సహా దాదాపు అ న్ని జిల్లాలు తడిసి ముద్దయ్యాయి. శుక్రవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుం డా కురుస్తున్న వర్షానికి పంట పొలాలు నీటమునిగాయి. పలు చోట్ల చెరువులకు గండ్లు పడ్డాయి. గోదావరి పరివాహక ప్రాంతంలో కొన్ని గ్రామాల్లోకి నీరు చేరుకోవడంతో అక్కడ జన జీవనం స్తంభించింది. భారీ వర్షానికి రహదారులు ధ్వంసం కాగా, పలు చోట్ల ఇళ్లు నేలమట్టమయ్యాయి. బొగ్గు ఉత్పత్తి చేసే సింగరేణి ఓ పెన్‌కాస్ట్ బొగ్గు ఉత్పత్తి కేంద్రాలు నీట మునగడంతో బొగ్గు వెలికితీత ఆగిపోయింది. జిల్లాల్లో పరిస్థితి ఇలా ఉండగా హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల్లో ఉదయం నుంచి వర్ష భీభత్సం కొనసాగింది. శనివారం ఉదయం నుంచి ఒకేతీరుగా వర్షం కు రుస్తుండడంతో ప్రజలు బయటకు రావడానికి ఇబ్బంది పడ్డారు. భాగ్యనగరం మొత్తం వర్షపు నీటితో చిత్తడి చిత్తడిగా మారింది.హైదరాబాద్ నగరంలోని మణికొండలోని పంచవటి కాలనీలో ఈదురు గాలులతో కూడిన వర్షం ధాటికి అపార్ట్మెంట్ ముందున్న ఓ భారీ వృక్షం విరిగి అక్కడే నిలిపి ఉంచిన కారుపై పడింది. కారు పూర్తిగా ధ్వంసం కాగా, సమయానికి అందులో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది.

నీట మునిగిన పంట పొలాలు
కాగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పలుచోట్ల ఇళ్లు దెబ్బతిన్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో జన జీవనం అస్తవ్యస్తమైంది. మహాదేవపూర్, కాటారం, మహా ముత్తారం, మలహర్రావు, పలిమెల మండలాల్లో భారీ వర్షం కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వందల ఎకరాల పంట నీట మునగడంతో అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి మహాదేవపూర్, కాటారం, మహా ముత్తారం, మలహర్రావు, పలిమెల, వందల ఎకరాల పత్తి, వరి పంటలు నీట మునిగింది. అధికారులు తక్షణమే స్పందించి నీట మునిగిన పంటలను సర్వే చేసి నష్టపరిహారం చెల్లించాలని అన్నదాతలు వేడుకుంటున్నారు. గతవారం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు చెరువు మొత్తం నిండిపోయి కట్ట పై నుంచి ప్రవహిస్తోంది. ఫలితంగా లింగాపురం పాడు వద్ద గల ప్రధాన రహదారిపైకి వరద నీరు చేరింది. దీంతో కొత్తపల్లి లింగాపురం కొంపల్లి కొత్తూరు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

దుమ్ముగూడెం మండలం కె.లక్ష్మీపురం, గౌరారం గ్రామాల మధ్య వరద నీరు చేరడంతో చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దుమ్ముగూడెం మండలంలోని పర్ణశాల వద్ద నార చీరల ప్రాంతం నీట మునిగి సీతవాగు ఉదృతంగా ప్రవహిస్తోంది. గుబ్బల మంగి వాగు వేగంగా ప్రవహించటంతో వంతెనను ఆనుకొని వరద నీరు ప్రవహిస్తోంది. ఇదే మండలంలో చేపల వేటకు వెళ్లి గోదావరిలో కొట్టుకొని పోయిన వ్యక్తి మృత దేహం సున్నంబట్టి రేవులో లభ్యమైంది. మృతుడిని ఆలుబాక గ్రామానికి చెందిన బనారి రాజు (45)గా గుర్తించారు. నిన్న చేపల వేటకు తెప్ప మీద వెళ్లి వరదలో గల్లంతయినట్లు స్థానికులు తెలిపారు. మరోవైపు తెలంగాణ నుంచి ఆంధ్ర మీదుగా ఒడిశాకు వెళ్లే ప్రధాన రహదారి అల్లూరి జిల్లా చింతూరు వద్ద కోయగూరు కల్లేరు గ్రామాల మధ్య రోడ్డు కొట్టుకుపోవటంతో ఒడిశా నుంచి ఆంధ్ర మీదుగా తెలంగాణకు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. జిల్లాలో వర్షాలు మరో రెండు రోజుల పాటు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఇప్పటికే గోదావరి సమీపంలోని లోతట్టు ప్రాంత వాసులను అప్రమత్తం చేశారు. రాష్ట్రంలో ఆరు జిల్లాల్లో వర్షం తీవ్రత ఎక్కువగా ఉంది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి జిల్లాలకు రెడ్‌అలర్ట్ కొనసాగుతుండగా, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, భూపాలపల్లికి వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది.

ఓపెన్ కాస్ట్ గనుల్లో నిలిచిన బొగ్గు ఉత్పత్తి
మంచిర్యాల జిల్లాలోని మందమర్రి, శ్రీరాంపూర్ సింగరేణి ఏరియాలోని ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. శ్రీరాంపూర్, ఇందారం, మందమర్రి, కళ్యాణి ఖని, ఆర్కే ఓపెన్ కాస్ట్ గనుల్లోకి నీరు చేరడంతో రోడ్లన్నీ నీటమునిగాయి. దీంతో ఓపెన్ కాస్ట్ గనుల్లో మట్టి, బొగ్గు తరలించే భారీ వాహనాలు ఎక్కడిక్కడ నిలిచిపోయాయి. ఓపెన్ కాస్ట్ గనుల్లోకి చేరిన వరద నీటిని భారీ మోటర్ల సహాయంతో బయటికి పంపిస్తున్నారు. వర్షం కారణంగా నాలుగు ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. గత మూడు రోజులుగా ఎడతెరిపి లేని వర్షానికి కాసిపేటలోని కెకె ఓపెన్ కాస్ట్ గనిలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో పాటు లక్షా 80 క్యూబిక్‌ల ఓబికి కూడా నష్టం జరిగిందని అధికారులు తెలిపారు. మరో రెండు రోజుల పాటు బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కొనసాగుతుందని అధికారులు ప్రకటించారు. మరోవైపు నది పరివాహక ప్రాంతాల్లోని పంట పొలాల్లో ఇసుక మేటలు వేస్తోంది.

వర్షాకాలం రాగానే ఇతర ప్రాంత రైతులు సంబరపడిపోతే అక్కడి రైతులు మాత్రం భయం భయంగా కాలం వెల్లదీయాల్సిన పరిస్థితి నెలకొంది. సింగరేణి పరిసర ప్రాంతాల్లోని రైతాంగం సరికొత్త సమస్యను ఎదుర్కొంటోంది. పెద్దపల్లి జిల్లా మంథని మండలం కన్నాలతో పాటు సమీప గ్రామాల రైతులు తమ పంటల్లోకి వరద నీటితో పాటు ఓపెన్ కాస్ట్ బావుల నుండి మట్టి కొట్టుకు రాకుండా చూడాలని అధికారులను వేడుకుంటున్నారు. సింగరేణి సంస్థ బొగ్గును వెలికితీసేందుకు ఏర్పాటు చేసిన ఓసీపీల వల్ల తమ పొలాలు మట్టిపాలవుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేలాది రూపాయలు వెచ్చించి వరి నాట్లు వేసుకుంటే వర్షపు నీటితో పాటు ఓబీ మట్టి తమ పొలాల్లోకి వచ్చి చేరుతోందని ఆందోళన చెందుతున్నారు. దీంతో నాట్లు వేసిన వరి అంతా కూడా ఓపెన్ కాస్ట్ మట్టిపాలు అవుతోందని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఒక్క కన్నాల గ్రామంలోనే సుమారు 50 ఎకరాల వరకు పంట పొలాలు ఓబి మట్టితో నిండిపోయాయి. భూ సేకరణ జరిపిన సింగరేణి సంస్థ ఓపెన్ కాస్ట్ మైన్స్ ద్వారా బొగ్గు నిల్వలను వెలికి తీస్తుంది. ఈ బావుల్లో మట్టిని వేరు చేసి బావికి సరిహద్దులు ఏర్పాటు చేసి సింగరేణి సంస్థ గుట్టలుగా పేరుకున్న ఓపెన్ కాస్ట్ మట్టి బయటకు రాకుండా చర్యలు చేపట్టాల్సి ఉంది.

అయితే వర్షాకాలం రాగానే సమీప గ్రామాల్లోని పంట పొలాల్లోకి వరద నీటి ప్రవహంలో కొట్టుకుంటూ వచ్చి చేరుతోంది. దీంతో రైతులు వేసిన వరినాట్లు మట్టికింద కూరుకపోతున్నాయని ఆవేదన చెందుతున్నారు. ఎకరాకు రూ. 40 వేల వరకు వెచ్చించి వరి సాగు చేస్తుంటే, ఓపెన్ కాస్ట్ మట్టి పొలాలను ముంచెత్తి తీరని నష్టానికి గురి చేస్తోందని రైతులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు పరిహారం ఇవ్వడంతోపాటు వరద నీటి ద్వారా ఓబి మట్టి దిగువ ప్రాంతానికి రాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో సింగరేణి సంస్థకు చెందిన లారీలను ఎక్కడికక్కడ నిలిపివేస్తామని హెచ్చరిస్తున్నారు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా రానున్న మూడు రోజులు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో ఆసిఫాబాద్ మండలంలోని గుండి గ్రామంలో ప్రజలు వాగు వద్దకు రావద్దని, వాగు దాటే ప్రయత్నం చేయవద్దని డప్పు చాటింపు వేయించారు.

గ్రామాల్లో నిలిచిన నీరు..స్థంభించిన జన జీవనం
బాసర మండల వ్యాప్తంగా శుక్రవారం రాత్రి నుంచి ఎడతెరపి లేని వర్షం కురిసింది. దీంతో మండలంలోని పలు గ్రామాల్లో ఎక్కడపడితే అక్కడ నీరు నిలిచిపోయాయి. మండలంలోని కొన్ని గ్రామాల్లో అంతర్గత రోడ్లన్నీ జలమయం కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బాసర మండలంలో లాబ్ది గ్రామంలో పలు విధులు చెరువును తలపించాయి. పలు కాలనీల్లో ఇండ్లలోకి వర్షపు నీరు రావడంతో గ్రామస్తులకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇండ్లలోకి వర్షపు నీరు చేరి సామాగ్రి, వస్తువులు తడిసిపోయాయని, రాత్రంతా జాగారం చేయాల్సి వచ్చిందని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే మంగపేట మండలంలోని గోదవరి గంట గంటకు ఉగ్రరూపం దాలుస్తుంది. దీంతో అధికారులు అప్రమత్తం ఆయ్యారు.

లోతట్టు ప్రాంతాల ప్రజలను ముందస్తుగానే పునరావాస కేంద్రాలకు తరలించి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. గత మూడు రోజులుగా జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ గోదావరి పరివాహక ప్రాంతాలలో సంచరిస్తు అధికారులను అప్రమత్త చేస్తున్నారు. అక్కినపల్లి మల్లారం గ్రామాలలో చాలవరకు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యి పంట పొలాలు సైతం నీట మునిగిపోయి పంట పొలాల్లో ఇసుక మేటలు వేశాయి. ప్రస్తుతం సైతం గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలలోని పంట పొలాలు సైతం నీటిలో మునిగి పోతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. మరో రెండు రోజలు భారీగా వర్షాలు కురిస్తే మండలంలోని పలు గ్రామాలు నీటి ముంపుకు గురయ్యే ప్రమాదం ఉన్నదని స్తానికులు ఆందోళన చెందుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News