Tuesday, April 8, 2025

తెలంగాణలో మళ్లీ వానలు

- Advertisement -
- Advertisement -

పలు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ

మన తెలంగాణ/హైదరాబాద్: ఒక వైపు ఎండలు దంచికొడుతుంటే, మరో వైపు వాతావరణ శాఖ వర్ష సూచన ప్రజలను అయోమయంలోకి నెడుతోంది. పగటి ఉష్ణోగ్రతల్లో విపరీతంగా పెరుగుదల, వేడి, ఉక్కపోతలతో జనం అల్లాడి పోతుంటే వాతావరణ శాఖ మూడు, నాలుగు రోజులు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించడం విచిత్రంగా ఉందని ప్రజలు చర్చించుకుంటున్నారు. సోమవారం ఆదిలాబాద్‌లో 42.3 డిగ్రీలు, నిజామాబాద్‌లో 42.5 డిగ్రీలు నమోదయ్యాయి. చాలా ప్రాంతాల్లో 38 డిగ్రీలు ఉష్ణోగ్రతలు దాటాయి. దీంతో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతుంటే ఒక్కసారిగా వాతావరణంలో సంభవించిన మార్పులతో మంగళవారం, బుధవారాల్లో రాష్ట్రంలో పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

ఇది ఒకరకంగా చల్లటి కబురుగా భావించినా అకాల వర్షాలతో రైతులు దారుణంగా నష్టపోవడం ఆందోళన కలిగిస్తోంది. సోమ, మంగళ, బుధవారాల్లో కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండి పేర్కొంది. ప్రధానంగా ములుగు, జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, నల్గొండ, మహబూబాబాద్, హన్మకొండ, వరంగల్, జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశాలున్నాయని స్పష్టం చేసింది. ఈ క్రమంలో ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ప్రస్తుతం దక్షిణ బంగాళా ఖాతం మధ్య ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడింది.

దీనికి అనుబంధంగా ఉన్న ఉపరితల చక్రవాత ఆవర్తనం సగటు సముద్రమట్టం నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించిందని తెలిపింది. ఇది రాగల 24 గంటల్లో నైరుతి బంగాళాఖాతంలో వాయువ్య దిశలోను, ఆ తర్వాత ఉత్తర దిశగా కదిలి, రాగల 48 గంటల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతానికి చేరుకునే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో తెలంగాణలో మంగళవారం, బుధవారం ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో ఓ మోస్తారు వర్షాలు చాలా ప్రాంతాల్లో కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. గంటకు 30 నుండి 40 కి మీ వేగంతో ఈదురు గాలులు వీచే చాన్స్ కూడా ఉందని తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News