Sunday, September 22, 2024

చేతికొచ్చిన పంట చెల్లాచెదురు

- Advertisement -
- Advertisement -

నీట తడిసిన కల్లాల్లో ఆరబోసిన మిర్చి
వరుసగా రెండోరోజు అన్నదాతను ఉక్కిరిబిక్కిరి చేసిన వర్షాలు
పలుచోట్ల పంట నష్టం అంచనాకు సిద్ధమవుతున్న అధికారులు

వడగళ్ల వానతో వేలాది ఎకరాల్లో దెబ్బతిన్న ఆరుతడి పంటలు

Rains damages red chilli crop

మన తెలంగాణ/న్యూస్ నెట్‌వర్క్:  ఊహించనివిధంగా వచ్చిపడ్డ ఈదురు గాలులతో కూడిన వర్షాలు అన్నదాతను కోలుకోలేకుండా చేశాయి. రెండు రోజులపాటు కురిసిన వర్షాలు రైతులకు కన్నీటిని మిగిల్చాయి. సంక్రాంతి పండుగతో భోగి మంటలతో సంతోషంగా గడపాల్సిన రైతన్నలకు కన్నీళ్లే మిగిల్చాయి. ఒక వంక గాలులు, మరో వంక వడగండ్లతో తెప్పరిల్లేలోగా వేలాది ఎకరాల్లో రైతుల కష్టం నీటిపాలైంది. కరీంనగర్, వరంగల్, ములుగు, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లోని వివిధ గ్రామాల్లో ఒక్కపెట్టున వీచిన ఈదురుగాలులతో కూడిన వర్షాలకు పలు వాణిజ్య పంటలు నేలకొరిగాయి. కరోనా కష్టకాలంలోనూ రైతులు దేన్ని లెక్కచేయకుండా వ్యవసాయన్నే నమ్ముకొని సాగు చేస్తే ప్రకృతి తీరని వేదన మిగుల్చుతోందని అన్నదాతలంటున్నారు. ఫిబ్రవరి, మార్చి వరకు పంట చేతికొచ్చే ముందే ఏపుగా పెరిగిన మిర్చి తోటలపై వడగండ్ల వర్షం భీకరంగానే దాడి చేసింది. రెండు మూడేండ్ల నుండి రైతులపై ప్రకృతి పగబట్టినట్లుగా కన్పిస్తోంది.

భారీ వర్షాలు, వడగండ్ల వర్షం, వైరస్‌లతో రైతులు పండించిన పంట ప్రకృతి దాడికి ధ్వంసమైపోతోందంటున్నారు. గతేడాది వాణిజ్య పంటలుగా ఉన్న  మిర్చి పంట వైరస్ సోకి వరంగల్ ఉమ్మడి జిల్లాలో వేలాది ఎకరాల్లో పంట తుడిచిపెట్టుకుపోయింది. ఏ గ్రామంలో చూసినా రైతన్నల ఆవేదన, ఆందోళనలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో వరుణుడు అన్నదాతలపై ముప్పేటదాడి చేశాడు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నర్సంపేట నియోజకవర్గంలోని దుగ్గొండి, నర్సంపేట, నల్లబెల్లి, నెక్కొండ, చెన్నారావు పేట మండలాల్లో మంగళవారం రాత్రి భారీగా వడగండ్ల వర్షం కురిసింది. వడగండ్లతో మిర్చి, మొక్కజొన్న చేతికి అందకుండా పోయింది. ఇప్పటికే మిర్చి పంట తామర వైరస్‌తో పంట నష్టపోగా ఉన్న కాస్తోకూస్తో చేతికి వస్తుందని భావించిన రైతులకు నిరాశే మిగిలింది. మొత్తంగా మిర్చి పంట నేలవారి కాసిన ఆకులు, పూత లేకుండా పోయిందని రైతులు బోరున విలపిస్తున్నారు.

మిర్చి సాగు ఎక్కువ శాతం నర్సంపేట, నల్లబెల్లి, దుగ్గొండి, మల్లంపల్లి, ఏటూరు నాగారం, పరకాల, ఆత్మకూరు, గీసుకొండ, భూపాలపల్లి ప్రాంతాల్లో ఎక్కువ శాతం దిగుబడి వస్తుంది. కొన్ని గ్రామాల్లో మొక్కజొన్న పంట సాగుచేసిన రైతులకు ఎదురుదెబ్బ తగిలినట్లయింది. మొక్కజొన్న పంట మొత్తం నేల వారిపోయిందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ఇటుకాలపల్లి, ఆకులతండా, దుగ్గొండి, నల్లబెల్లి మండలాల్లోని పలు గ్రామాల్లో దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. కలెక్టర్ గోపితో కలిసి ఎమ్మెల్యే నర్సంపేట, నల్లబెల్లి మండలాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా పంట నష్టం అంచనా వేయాలని ఆయన వ్యవసాయ శాఖ, రెవెన్యూ అధికారులను కలెక్టర్ గోపి ఆదేశించారు. నర్సంపేట మండలంలోని చంద్రయ్యపల్లెలో ఉన్న గొర్రెల మందపై రాళ్ల వర్షం దాటికి గొర్రెలన్ని బావిలో పడి మృతి చెందాయి. వడగండ్లతో ఇదే గ్రామంలో కోళ్ల ఫాంలో కోళ్లన్ని చనిపోయాయి. లక్షల్లో పెట్టుబడులు పెట్టిన రైతులకు అకాల వర్షాలు, వడగండ్ల వానతో పూర్తిగా నష్టపోతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలో అత్యధికంగా 46.08 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. వడగండ్ల వర్షం ఎక్కువ శాతం నర్సంపేట, నల్లబెల్లి, దుగ్గొండి, పరకాల మండలాల్లో కురిసింది. ఈ మండలాల్లోనే ఇండ్లు, పశువులు, పంటలన్నీ ధ్వంసమయ్యాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News