హైదరాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ ప్రాంతాల్లో
భారీ వర్షాలు కురిసే అవకాశం
హైదరాబాద్: రాష్ట్రంలో మరో మూడురోజుల పాటు పలుచోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఉత్తర బీహార్ నుంచి జార్ఖండ్, ఇంటీరియర్ ఒడిస్సాల మీదుగా ఉత్తర కోస్తాంధ్ర వరకు సముద్రమట్టం నుంచి 2.1 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉత్తర-దక్షిణ ఉపరితల ద్రోణి ఏర్పడిందని వాతావరణ శాఖ (ఐఎండి) అధికారులు తెలిపారు. అలాగే ఉత్తర ఒడిస్సా, పశ్చిమబెంగాల్‌లలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం నుంచి ఉత్తర కోస్తాంధ్ర వరకు సముద్రమట్టానికి 3.1కిలోమీటర్ల ఎత్తు వద్ద ఏర్పడిన ఉపరితల ద్రోణి బలహీనపడిందన అధికారులు తెలిపారు.
ఉత్తర దక్షిణ ఉపరితలంలోని ఉత్తర కోస్తా ఒడిశా నుంచి దక్షిణ కోస్తా తెలంగాణ వరకు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల దూరంలో ఉపరితల ద్రోణి ఏర్పడటంతో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో రాబోయే మూడు రోజుల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని అధికారులు తెలిపారు. మరో 24 గంటల్లో హైదరాబాద్‌తో పాటు ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ ప్రాంతాల్లో కూడా విస్తారంగా వర్షాలు కురుస్తాయని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. గురువారం పలుచోట్ల కురిసిన వర్షపాతం వివరాలు ఇలా… సంగారెడ్డిలో 56.8 మిల్లీమీటర్లు, ఆదిలాబాద్‌లో 49.5, జోగులాంభ గద్వాల్‌లో 40.8, కామారెడ్డిలో 35.8, కుమురంభీం ఆసిఫాబాద్‌లో 22.8, ములుగులో 17.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది.
ఈ నెల 11వ తేదీన అల్పపీడనం..
ఇక వాయువ్య బంగాళాఖాతంలో ఈ నెల 11న అల్పపీడనం ఏర్పడనుంది. ఆంధ్రప్రదేశ్, -దక్షిణ ఒడిశా తీరాలకు దగ్గరలో, పశ్చిమ మధ్య, దానిని అనుకొని ఉన్న వాయవ్య బంగాళాఖాతంలో జూలై 11వ తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం (ఐఎండి) తెలిపింది.