పలు జిల్లాలో భారీ వర్షాలు
హైదరాబాద్: రేపటి నుంచి వచ్చే నాలుగు రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిన నేపథ్యంలో పలు జిల్లాలో వానలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. పశ్చిమ బంగాళాఖాతంలో స్థిరంగా కొనసాగుతున్న ఆవర్తనం ప్రభావంతో సోమవారం పశ్చిమ మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడిందని దీనికి అనుబంధంగా ఉన్న ఆవర్తనం సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి నైరుతి దిశగా సాగుతోందని వాతావరణ శాఖ తెలిపింది. మరో రెండు రోజుల్లో ఇది పశ్చిమ వాయవ్య దిశగా కదిలి ఆంధ్రప్రదేశ్ తీరం వైపు వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. దాంతో తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశముందని ఈ నేపథ్యంలోనే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ ప్రాథమిక హెచ్చరికలు జారీ చేసింది.