వడగాలులు..వానలు
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో వాతావరణ మారిపోయింది. సెగలు చిమ్మే వడగాలులు..అంతలోనే వర్షాలు భిన్న వాతావరణ అనుభూతులు కల్పిస్తున్నాయి. మరో వైపు మండుటెండలతో ఉక్కిరి బిక్కిరవుతున్న ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి ప్రకటన చేసింది రానున్న మూడు రోజులు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్టు తెలిపింది. ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు వాతావరణ శాఖ అందించిన చల్లని వార్త పెద్ద ఊరట నిస్తోంది.
హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చెల్ మల్కాజిగిరి ,యాదాద్రి భు వనగిరి జిల్లాల్లో ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని , సాయంత్రం వేళలలో ఈదురు గాలులతో పాటు ఉరుములు , మెరుపులతో వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్టు తెలిపింది. అదే విధంగా రాజధాని సమీపాన ఉన్న పరిసర జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవాకాశం ఉందని వెల్లడించింది. గ్రేటర్‌కు ఆనుకుని ఉన్న సమీప జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు గరిష్టంగా 42డిగ్రీల వరకూ నమోదయ్యే అవకాశాలు ఉన్నట్టు తెలిపింది.
వడగాడ్పుల్లో ఉత్తర తెలంగాణ:
రాష్ట్రంలో ఉత్తర తెలంగాణ ప్రాంతం ఉడుకెత్తిపోతోంది. పగటి ఉష్ణగ్రతలు ఏమాత్రం తగ్గటం లేదు. వీటికి తోడు వేడిగాలుల తీత్రత పెరిగింది. శనివారం అత్యధికంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మహదేవ్‌పూర్‌లో 45డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నిజామాబాద్ జిల్లా వేంపల్లేలో 44.8, కొమరంభీం జిల్లా కెరమెరిలో 44.7, సిద్దిపేట జిల్లా చిట్యాల్‌లో 44.4, అదిలాబాద్ జిల్లా చాప్రాలలో 44.2, నిర్మల్ జిల్లా కడెం పెద్దూర్‌లో 44.2, రాజన్న సిరిసిల్ల జిల్లా మల్లారంలో 44.1, నిజామాబాద్ జిలలా మెన్‌డూర్‌లో 44,అదిలాబాద్ జిల్లా అర్లిలో 43.9, కరీంనగర్‌జిల్లా గంగిపల్లిలో 43.9డిగ్రీల ఉష్ణగ్రతలు నమోదయ్యాయి.
రుతుపవనాలకు అనుకూల వాతావరణం
నైరుతి రుతుపవనాలు పురోగమించడానికి అనువైన వాతావరణం నెలకొన్నట్టు వాతవరణ శాఖ వెల్లడిచింది. నైరుతి గాలులు నిలకడగా ఉండటం, ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్ నికోబార్ దీవులు, అండమాన్ సముద్రంలో వర్షాలు పడటం వల్ల రుతుపవనాల పురోగమనానికి అవకాశం ఏర్పడినట్టు తెలిపింది.