మనతెలంగాణ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ తీరంలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉన్న ఆవర్తనం ప్రస్తుతం సగటు సముద్ర మట్టానికి 5.8కి.మీ ఎత్తు వరకు విస్తరించి నైరుతి దిశగా వంపు తిరిగి ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈశాన్య బంగాళాఖాతం దాని పరిసరాల్లో ఒక ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 5.8 కి.మీ ఎత్తు వరకు ఉందని ఈ నేపథ్యంలోనే రాగల మూడురోజులు తెలంగాణలో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. నేడు, రేపు, ఎల్లుండి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ఎపికి తుఫాన్ ముప్పు.. 48 గంటల్లో మరో వాయుగుండం
వరుస వాయు గుండాలతో ఆంధ్రప్రదేశ్ తడిసి ముద్దవుతోంది. అయితే మరో వాయుగుండం ప్రభావంతో 48 గంటల్లో భారీ వర్షాలు పడనున్నట్టు అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఒడిసా తీరానికి దగ్గరలో వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో రానున్న 48 గంటల్లో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణశాఖ అంచనా వేసింది. ఉత్తరాంధ్ర- దక్షిణ ఒడిసా తీరాలకు దగ్గరలో ఉపరితల ఆవర్తనం కొనసాగు తోందని, ఇది ఎత్తుకు వెళ్లే కొద్దీ నైరుతి దిశగా ఒంపు తిరిగి ఉందని, దీని ప్రభావంతో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.
Rains in several areas in Telangana for next 3 days