తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. రానున్న నాలుగు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. తెలంగాణపై క్యుములో నింబస్ మేఘాలు ఆవరించి ఉన్నట్టు తెలిపింది. హైదరాబాద్‌లోనూ భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. వికారాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డి, శంకర్‌పల్లి ప్రాంతాల్లో భారీ వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో పాటు నగరంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. నైరుతి బంగాళాఖాతంలో ఈనెల 22న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.
ఇది మే 24నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. మారిన వాతవరణ పరిస్థితుల ప్రభావంతో ఈ నెల 23 వరకు ఏపీ, తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. కోస్తాంధ్ర, తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.