Sunday, November 24, 2024

రాష్ట్రమంతటా విస్తారంగా వర్షాలు

- Advertisement -
- Advertisement -
తెలంగాణను కమ్ముకున్న రుతుపవనాలు
ఏడు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ
అత్యధికంగా సిద్దిపేట జిల్లాలో 62మి.మి వర్షం

హైదరాబాద్: నైరుతి రుతుపవనాలు తెలంగాణ అంతటిని కమ్ముకున్నాయి. రాష్ట్రంలో వాతావరణం ఒక్క సారిగా మారిపోయింది. ఉదయం నుంచి శీతల గాలులు వీస్తున్నాయి. సుమారు వందరోజులకుపైగా మాడు పగలగొట్టిన ఎండలు కనుమరుగయ్యాయి.పగటి ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా కిందకు పడిపోయాయి. శీతల వాతావరణంతో తెలంగాణ ఊటీ కొడైకెనాల్ తదితర ఉదక మండలాలను తలపిస్తోంది. అధిక ఉష్ణోగ్రతలతో ఉడికెత్తిపోయన ప్రజలను చల్లబడ్డ వాతావరణం సేదతీరుస్తోంది. నైరుతి రుతుపవనాలు రాష్ట్ర మంతటికీ విస్తరించాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

ఈ నెల 22వ తేదినాటికే ఖమ్మం జిల్లాలోకి ప్రవేశించిన రుతుపవనాలు శుక్రవారం తెలంగాణలోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించాయి. శనివారం నాటికి ఇవి రాష్ట్రమంతటికీ పరుచుకున్నాయి. మరో వైపు ఉపరితల ఆవర్తనం వాయువ్య బంగాళాఖాతం పరిసరాలలోని ఒడిస్సాపశ్చిమ బెంగాల్ తీరాలకు దగ్గరలో సగటు సముద్ర మట్టం నుండి 7.6కిలోమీటర్ల వరకూ స్థిరంగా కొనసాగుతూ , ఎత్తుకు వెళ్లే కొలది నైరుతి దిశ వైపుగా వంపు తిరిగి స్థింరగా కొనసాగుతోందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో రాగల మూడు రోజులు తెలంగాణ రాష్ట్రంలో ఉరుములు ,మెరుపులతో కూడిన వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపింది.కొమరంభీం, మంచిర్యాల, కరీంనగర్ , పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి , వరంగల్ , హన్మకొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపింది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

గ్రేటర్ హైదరాబాద్ నగరంతోపాటు పరిసర ప్రాంతాలకు ప్రత్యేక వాతావరణ సూచనలు చేసింది. రాగల 24గంటల పాటు ఆకాశం సాధారణంగా మేఘావృతం అయివుంటుంది. నగరంలో తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది.కొన్ని ప్రాంతాల్లో ఉరుములు , మెరుపులతో కూడిన వర్షం కురిసే అంవకాశం ఉంది.ఉష్ణోగ్రతలు గరిష్టంగా 31డిగ్రీలు, కనిష్టంగా 23డిగ్రీలు నమోదయ్యే అవకాశాలు ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

నైరుతి రుతుపనాల ప్రభావంతో రాష్ట్ర మంతటా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. శనివారం రాష్ట్రంలో అత్యధికంగా సద్దిపేట జిల్లా తొగుట మండలం రాంపూర్‌లో 62మి.మి వర్షం కురిసింది. మిగిలిన ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కురిసింది. ముత్తారంలో 48.8, ఎల్లంకిలో 46.8, కృష్ణలో 44.8, ముస్తాలలో 42.8, నర్సాపూర్‌లో 41.3, కొమురవెల్లిలో 40.5, కొండాపూర్‌లో 39.5,సర్వాయిపేటలో 39.5, చీకోడ్‌లో 37.8, లక్మాపూర్‌లో 37, కామారెడ్డిలో 36.8, మోడంపల్లిలో 36.5, మెనూర్‌లో 36.3, ఊట్కూర్‌లో 35.5, మల్లారంలో 34.5, కౌడిపల్లిలో 34, ముత్తారంలో 33.5, జంబుగలో 32. మి.మి వర్షపాతం నమోదైంది. మిగిలిన ప్రాంతాల్లో కూడా ఒక మోస్తరు నుంచి తేలిక పాటి జల్లులు కురిశాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News