తెలంగాణలో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇవాళ, రేపు ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. దీంతో ఈ జిల్లాలకు వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
మరోవైపు, బంగాళఖాతంలో అల్పపీడనం ప్రభావం కారణంగా ఆంధ్రప్రదేశ్ లోనూ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని చెప్పింది. ఇవాళ, రేపు ఎపిలోని కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. దీంతో ఉరుములతో కూడిన వర్షం పడేటప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చెట్ల క్రింద నిలబడవద్దని సూచించింది. వర్షాల నేపథ్యంలో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు అధికారులను ఆదేశించాయి. కాగా, ఇటీవల కురిసిన వర్షాలకు పలు ప్రాంతాల్లో పంటలు దెబ్బతిన్న సంగతి తెలిసిందే. అకాల వర్షాలతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.