మనతెలంగాణ/హైదరాబాద్ ః రాష్ట్రంలో మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ అండమాన్ సముద్ర పరిసర ప్రాంతాల్లో ఆవర్తనం కొనసాగుతుందని పేర్కొంది. సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ఆవర్తనం ఉందని తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి రాష్ట్రంలోకి కిందిస్థాయి గాలులు వీస్తున్నాయని చెప్పింది. వీటి ప్రభావంతో రాష్ట్రంలో ఆది, సోమ వారాల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మంగళవారం అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. ఇదిలా ఉండగా గడిచిన 24 గంటల్లో రంగారెడ్డి, నాగర్‌కర్నూల్, జోగులాంబ గద్వాలతో పాటు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో ఉదయం నుంచి విడతల వారీగా వర్షం కురుస్తోంది. దీంతో పలు చోట్ల ట్రాఫిక్ నిలిచిపోయింది.
అసెంబ్లీ, నాంపల్లి, కోఠి, సుల్తాన్ బజార్, బేగంబజార్, హైదర్గూడ, నారాయణగూడ, హిమాయత్నగర్, లిబర్టీ, బషీరాబాగ్, దిల్‌సుఖ్‌నగర్, కొత్తపేట, సరూర్‌నగర్, ఎల్‌బినగర్, చంపాపేట్, వనస్థలిపురం తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. కొంతసేపు భారీ వర్షం మరికొంత సేపు ఈదురుగాలులతో కూడిన చిరుజల్లులతో నగరవాసులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. రహదారులపై నీరు నిలిచిపోయి వాహన చోదకులు, పాదచారులు సతమతమయ్యారు. రోడ్లపై గుంతల్లో నీరుచేరి ద్విచక్రవాహనదారులు ఇబ్బంది పడ్డారు. వర్షం కురుస్తున్నంతసేపు మెట్రో రైలు మార్గాల్లో గల వంతెనల కింద వాహన చోదకులు ఉండిపోయారు. మరికొందరు తడుచుకుంటూనే వారి వారి గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. రాష్ట్రంలో ఒకటి లేదా రెండు చోట్ల ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం ఉందని, సోమ,మంగ్ల వారాల్లో తేలికపాటినుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.
ఎస్‌ఆర్‌ఎస్‌పికి స్వల్ప ఇన్‌ఫ్లో
నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్లోకి 764 క్యూసెక్కుల ఇన్ఫో కొనసాగుతున్నదని ఎఇఇ రవి తెలిపారు. కాకతీయ కాలువకు 50, మిషన్ భగీరథ తాగునీటి కోసం 152 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నారని పేర్కొన్నారు.ఎగువ ప్రాంతాల నుంచి ప్రాజెక్టులోకి ఈ సీజన్లో 676.011 టిఎంసిల వరద వచ్చిందని వివరించారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091.00 అడుగులు (90.313 టిఎంసిలు) కాగా ఆదివారం సాయంత్రానికి పూర్తిస్థాయి నీటిమట్టం కలిగి ఉందని ఎఇఇ తెలిపారు.