కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వానలు
నేడు ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం
ఈనెల 9నుంచి ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు వర్షాలు పడనున్నాయి. తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఆగ్నేయ బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో సోమవారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వా తావరణ శాఖ వెల్లడించింది. అల్పపీడనం ఏర్పడిన తరవాత తుఫాన్ దిశ, ప్రభావాన్ని వెల్లడిస్తామని హైదరాబా ద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభా వం వల్ల ఈ నెల 9నుంచి క్రమంగా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని వెల్లడించింది. రాష్ట్రంలో కొన్ని చోట్ల 40 నుంచి 43 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరగనున్నాయని తెలియజేసింది. హైదరాబాద్‌లో 40 డిగ్రీల వ రకు ఉష్ణోగ్రతలు ఉండవచ్చని తెలిపింది. నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.
దక్షిణ దిశ నుంచి రాష్ట్రంలోకి గాలులు
నేడు, రేపు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పలు చోట్ల కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ రోజు దిగువ స్థాయిలోని గాలులు దక్షిణ దిశ నుంచి రాష్ట్రంలోకి వీస్తున్నాయని అధికారులు తెలిపారు. ఆగ్నేయ బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఉన్న ఉపరితల ఆవర్తనం ఆదివారం అండమాన్ సముద్రంలో కొనసాగుతోందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావం వల్ల నేడు అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇది తీవ్రతరంగా మారి తుఫాన్‌గా బలపడే అవకాశం ఉందన్నారు. అల్పపీడనంగా మారిన తరవాత ఈ తుఫాన్ దిశ, వేగం, తీవ్రత తెలుస్తాయని అధికారులు వెల్లడించారు.
పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్
ఈ మేరకు వాతావరణ శాఖ పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది. ఆదివారం నుంచి సోమవారం వరకు కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెడల్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, జోగులాంబ గద్వాల, నాగర్‌కర్నూల్ వనపర్తి అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పింది.
మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు
సోమవారం నుంచి మంగళవారం వరకు ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, సిద్దిపేట, యదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది.