తుంగభద్రకు భారీ వరద.. ప్రాజెక్టులోకి 61,189 క్యూసెక్కులు చేరిక
19టిఎంసీలకు పెరిగిన నీటి నిల్వ, శ్రీరాంసాగర్‌కు స్వల్పంగా వరదనీరు
మనతెలంగాణ/హైదరాబాద్: నైరుతి రుతుపవనాలకు స్వాగతం చెబుతూ గత రెండు రోజులుగా తొలకరి వర్షాలు వ్యవసాయ రంగంలో ఆశలు రేకెత్తిస్తున్నాయి. ఈ ఏడాది సాధారణ పరిస్థితులకంటే ఎంతో ముందుగానే కృష్ణానది పరివాహకంగా ఎగువ ప్రాంతాల్లో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. కర్నాటకలో తుంగ , భధ్ర నదులు భారీగా వరదనీటితో పోటెత్తి ప్రహహిస్తున్నాయి . తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ , కర్ణాటక రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టుగా ఉన్న తుంగభద్ర ప్రాజెక్టుకు ఎగువ నుంచి భారీగా వరద నీరు చేరుకుంటుండంతో జలాశయంలో నీటి మట్టం వేగంగా పెరుగుతూ వస్తోంది. శనివారం ప్రాజెక్టులోకి 61,189క్యూసెక్కుల వరదనీరు చేరుకుంటోంది. తుంగభద్ర ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 1633అడుగులు కాగా, శనివారం నాటికి ఇది 1600.11అడుగుల స్థాయికి చేరుకుంది. గత ఏడాది ఇదే సమయానికి ఈ ప్రాజెక్టులో నీటి మట్టం 1585అడుగులు మాత్రమే ఉండేది. ఈ సారి భారీ వర్షాలు వరద ప్రవాహాల వల్ల నీటిమట్టం గణనీయంగా మెరుగుపడుతూ వస్తోంది. ప్రాజెక్టులో పూర్తి స్థాయి నీటి నిల్వ 100.86టిఎంసీలకుగాను, ఇప్పటికే నీటినిల్వ 19.77టిఎంసిలకు చేరుకుంది. ఈ నెల 19 నుంచి మూడు రోజుల వ్యవధిలోనే 5టిఎంసీల నీటినిలువ పెరిగింది.
గత ఏడాది ఈ సమయానికి ప్రాజెక్టులో కేవలం 6.95టిఎంసిలు మాత్రమే నిలువ వుండేది. ప్రాజెక్టులోకి ఇదే ఊపులో ఎగువనుంచి వరద ప్రవాహం మరో నాలుగైదు రోజులపాటు కొనసాగే అవకాశం ఉన్నట్టు తుంగభద్ర బోర్డు అధికారులు అంచానా వేస్తున్నారు. ఈ లోపు రుతుపవనాలు కూడ తోడైతే వర్షాల ఉధృతి మరింతగా పెరిగి తుంగభద్ర ప్రాజెక్టు జూన్ మూడవ వారం ముగిసేలోపే పూర్తి స్థాయిలో నిండే అవకాశాలు లేకపోలేదంటున్నారు. మరో వైపు కర్ణాటక ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో కృష్ణానదిలో కూడా స్వల్పంగా నీటి ప్రవాహం ఏర్పడింది. రాష్ట్ర ముఖద్వారంలో ఉన్న జూరాల ప్రాజెక్టులోకి ఎగువ నుంచి 685క్యూసెక్కుల వరదనీరు చేరుకుంటోంది. ప్రాజెక్టులో గత ఏడాది ఇదే సమయానికి నీటినిల్వ 4.14టిఎంసీలు ఉండగా , ప్రస్తుతం ఈ ప్రాజెక్టులో 6.55టిఎంసిల నీరు నిలువ ఉన్నట్టు నీటిపారుదల శాఖ అధికారులు వెల్లడించారు.
శ్రీశైలంపై చిగురిస్తున్న ఆశలు:
తెలుగు రాష్ట్రాల వరప్రదాయినిగా ఉన్న శ్రీశైలం ప్రాజెక్టుపై ఈ ఏడాది రెండు రాష్ట్రాల రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. గత ఏడాది ఇదే సమయానికి ఈ ప్రాజెక్టులో 32.88టిఎంసిల నీరు నిలువ ఉండేది. అయితే ప్రస్తుతం ఇందులో నీటి నిల్వ 35.73టిఎంసిలకు చేరింది. ఎగువ నుంచి ప్రాజెక్టులోకి 621క్యూసెక్కుల నీరు చేరుతోంది. తుంగభద్ర వేగంగా నిండితే శ్రీశైల ప్రాజెక్టు నీటి మట్టాలు కూడా పెరిగే అవకాశాలు ఉన్నట్టు చెబుతున్నారు. నాగార్జున సాగర్ జలాశయంలో ప్రస్తుతం నీటినిల్వ 183.16టిఎంసిలు ఉంది. గత ఏడాది ఇదే సమయానికి ఈ ప్రాజెక్టులో 178.07టిఎంసిలు మాత్రమే ఉండేది. సాగర్ నుంచి పవర్‌హౌస్ ద్వారా 459క్యూసెక్కులు, కాలువలకు 1500క్యూసెక్కులు విడుదలవుతున్నాయి. దిగువన పులిచింతలలో కూడా నీటి మట్టం ఎంతో మెరుగ్గావుంది, ఈ ప్రాజెక్టు గరిష్ట నీటినిలువ 45.77టిఎంసిలు కాగా, ప్రస్తుతం ఇందులో 33.05టిఎంసిల నీరు నిలువ ఉంది. గత ఏడాది ఇదే సమయానికి ఇందులో కేవలం 11.59టిఎంసిలు మాత్రమే నిలువ వుండేదని అధికారులు వెల్లడించారు.
కదిలిన గోదావరి :
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో గోదావరి నదిలో కూడా కదలికి వచ్చింది. శ్రీరాం సాగర్ ప్రాజెక్టులోకి ఎగువనుంచి 746క్యూసెక్కుల నీరు చేరుతోంది. ప్రాజెక్టులో పూర్తి స్థాయి 90.31టిఎంసీలకు గాను ప్రస్తుతం 20.56టిఎంసీల నీరు నిలువ ఉంది. గత ఏడాది ఇదే సమయానికి ఈ ప్రాజెక్టులో 19.17టిఎంసిల నీరు నిలువ ఉండేది.