Wednesday, January 22, 2025

రాష్ట్రంలో 5రోజుల పాటు వర్షాలు

- Advertisement -
- Advertisement -

రాష్ట్రంలో రాగల ఐదు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.నైరుతి రుతుపవనాలు శనివారం కేరళలోని మిగిలిన ప్రాంతాలతోపాటు తమిళనాడు ,ఏపిలోని రాయలసీమ, కర్టాటక రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలలోకి ప్రవేశించేందుకు పరిస్థితులు పూర్తి అనుకూలంగా వున్నట్టు తెలిపింది. ఉపరితల ఆవర్తనం ఒకటి కోస్తాంధ్ర ప్రదేశ్ దాని పరిసర ప్రాంతాల వద్ద సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మి ఎత్తలో కేంద్రీకృతమై ఉన్నట్టు తెలిపింది. రాష్ట్రంలో కిందిస్థాయి గాలులు పశ్చిమ వాయువ్య దిశల నుండి వీస్తున్నాయని వెల్లడించింది. వీటి ప్రభావంతో ఆదివారం నుంచి గురువారం వరకూ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కొన్ని జిల్లాల్లో ఉరుములు , మెరుపులతోపాటు గంటకు 40 కిలోమీటర్ల వేగంతో వీచే ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ,అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

నేడు 12జిల్లాలకు ఎల్లో అలర్ట్ :
వాతావరణ కేంద్రం రాష్ట్రంలో ఆదివారం నాడు 12జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్ , రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట్ ,జోగులాంబ గద్వాల, జిల్లాల్లో అక్కడడక్కడా ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపింది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. రాజన్న సిరిసిల్ల, కరీంనగర్ , పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్ , హన్మకొండ, జనగాం జిల్లాలలో అక్కడక్కడ వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు వెల్లడించింది.

గ్రేటర్ హైదరాబాద్ మేఘావృతం:
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రాగల 24గంటల్లో ఆకాశం మేఘావృతమై వుంటుందని ,తేలికపాటి లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురవనున్నట్టు తెలిపింది.
తేలిపాటి వర్షాలు
రాష్ట్రంలొని పలు ప్రాంతాల్లో శనివారం తేలికపాటి వర్షాలు కురిశాయి. మహేశ్వరంలో 15 మి.మి వర్షం కురిసింది. కాకర్వాల్‌లో 9, భద్రాచలంలో 8.8, కాల్డుర్కిలో 6.3, చందుర్‌లో 6.3, పరిగిలో 4.5మి.మి చొప్పున వర్షం కురిసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News